సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు
గురువారం ఉదయం బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఈపూరుపాలెం సమీపానికి వచ్చేసరికి అక్కడ పట్టా విరిగి ఉండటాన్ని కీమ్యాన్ గుర్తించాడు.
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగిపోయి ఉండటాన్ని కీ మ్యాన్ గుర్తించాడు. వెంటనే అతను ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే వారు అప్రమత్తమై సంఘమిత్ర రైలును నిలిపివేశారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం ఉదయం బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఈపూరుపాలెం సమీపానికి వచ్చేసరికి అక్కడ పట్టా విరిగి ఉండటాన్ని కీమ్యాన్ గుర్తించాడు. వెంటనే పైఅధికారులకు సమాచారం అందించడంతో రైలును నిలిపేసి.. సిబ్బందితో హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు. అనంతరం ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనతో సుమారు అరగంట పాటు పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. వివిధ స్టేషన్లలో ఐదు రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఇటీవల అదే రైలు పట్టా విరగడంతో మరమ్మతులు చేసినట్టు తెలిసింది. రైలు పట్టా విరిగిన విషయం తెలుసుకున్న సంఘమిత్ర రైలు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ఊపిరి పీల్చుకున్నారు.