Telugu Global
Andhra Pradesh

ఏపీలో రీకౌంటింగ్, లేదా రీపోలింగ్.. 'సాక్షి' ఆసక్తికర కథనం

అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్‌ తో కుమ్మక్కై కూటమి కోసం పని చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు, మెజారిటీపైనా వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో రీకౌంటింగ్, లేదా రీపోలింగ్.. సాక్షి ఆసక్తికర కథనం
X

ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. "లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాం, గతంలో ఎవరూ చేయని పథకాలు తీసుకొచ్చాం, భవిష్యత్తులో ఇంకెవరూ ఈ స్థాయిలో డీబీటీ ఇవ్వలేరన్నట్టుగా చేశాం. మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబమంటూ లేదు. కానీ ఫలితాలు ఎందుకిలా వచ్చాయి..?" అని ఆలోచిస్తున్నారు. నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలోనే లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమైతే ఆ 11 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది నెటిజన్ల ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా.. వైసీపీ అభిమానులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఓ కథనం ప్రచురించింది.

వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయని, అందుకే ఈ ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సానే అమర్‌నాథ్ అనే వ్యక్తి Change.org ద్వారా పిటిషన్‌ వేశారని సాక్షి కథనం ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలా అమర్ నాథ్ పోరాటం మొదలు పెట్టారని, ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరింది. ఆ పోర్టల్ లో కి వెళ్లి ఆయన పిటిషన్ కి మద్దతివ్వాలని ప్రజల్ని అభ్యర్థించింది. వీలయితే రీపోలింగ్, లేదంటే కనీసం రీ కౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్ నాథ్ చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజల్ని కోరింది.

అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్‌ తో కుమ్మక్కై కూటమి కోసం పని చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు, మెజారిటీపైనా వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్‌ గుర్తుకే ఓటేశామని అంటున్నా.. వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్నస్తున్నారు, నిలదీస్తున్నారు. మరి Change.org ద్వారా వేసిన పిటిషన్‌ ని ఎన్నికల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంటుందా..? వైసీపీ కోరుకుంటున్నట్టు తిరిగి ఏపీలో వెంటనే ఎన్నికలు జరిగి ఆ పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారా..? అసలిది సాధ్యమేనా..? సోషల్ మీడియాలో మాత్రం పెద్ద రచ్చ జరుగుతోంది. వైసీపీ ఓటమిని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.

First Published:  9 Jun 2024 2:02 AM GMT
Next Story