Telugu Global
Andhra Pradesh

సాక్షి.. చల్లగా, చప్పగా..

సోషల్ మీడియాలో నలిగిపోయిన ఈ సబ్జెక్ట్ పై ఇప్పుడు అరిగిపోయిన రికార్డ్ ని సాక్షి వినిపించినట్టయింది. ప్రతిదాడి బలంగా చేయాల్సిన సమయంలో బురద కడుక్కోడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టయింది.

సాక్షి.. చల్లగా, చప్పగా..
X

కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్ది, ఈ సినిమా డైలాగ్ సీఎం జగన్ కి కరెక్ట్ గా సరిపోతుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. అయితే జగన్ అనుకూల మీడియా కూడా అలాగే కొడుతుంది అనుకుంటే అది పొరపాటే. ఈనాడులో వచ్చిన వార్తలకు ఖండనలు ఇచ్చే విషయంలో సాక్షి దెబ్బ తమలపాకుతో కొట్టినట్టుగా ఉంది.

'చార్టర్డ్ ఫ్లైట్ లో పేదల పక్షపాతి' అంటూ సీఎం జగన్ లండన్ ప్రయాణంపై ఈనాడు ఇచ్చిన ఆర్టికల్ ఏపీలో రాజకీయ రచ్చకు తెరతీసింది. అందులో రాసినవి నిజాలా, అబద్ధాలా అనే విషయం పక్కనపెడితే, జగన్ వెళ్లిన విమానం పేరు, దాని ఖరీదు, అద్దె... ఇతర వివరాలు సామాన్య ప్రజలకు కూడా ఆసక్తిగా మారాయి. వైసీపీ అభిమానులు కూడా ఆ వివరాలు తెలుసుకుని నిజమేనా అనుకున్నారు. వివరాలు కరెక్టే కానీ ఆ వార్తతో ఈనాడు చెప్పాలనుకున్నవే అబద్దాలు. పేదల పక్షపాతి అయిన జగన్ పెద్ద కంపెనీ ఫ్లైట్ లో ఎందుకు వెళ్లాడనే లాజిక్ ఎక్కడా చెల్లదు. ఎన్నికల అఫిడవిట్ లో ఎక్కడైనా జగన్ తాను నిరుపేదను అని చెప్పుకోలేదు. అధికారికంగా ఆయన ప్రకటించిన ఆస్తులకు, ఆయన వెళ్లిన ఫ్లైట్ కి ఎక్కడా నాన్ సింక్ లేదు. కానీ ఈనాడు ధీమాగా ఓ కట్టుకథ అల్లేసి బురదజల్లేసింది.

ఈనాడు కథనం జనంలోకి వెళ్లాక మూడోరోజు తీరిగ్గా సాక్షి వివరణ ఇచ్చుకుంది. పోనీ ఆ వివరణలో కొత్త విషయాలేవైనా చెప్పారా అంటే అదీ లేదు. గతంలో అందరికీ తెలిసిన విషయాలనే ఒకేచోట గుదిగుచ్చి రామోజీపై రంకెలేశారు. 'గురివిందకు ముదిరిన పచ్చ కామెర్లు' అనే హెడ్డింగ్ తో మమ అనిపించారు. ఎక్కడో ఎనిమిదో పేజీలోకి తోసేశారు.

క్యాంపు కార్యాలయాల పేరుతో చంద్రబాబు చేసిన దుబారా, ఆయన విదేశీ ప్రయాణాల ఖర్చులు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు అంటూ సాక్షి కథనంలో వివరాలున్నా.. అప్పటికే పుణ్యకాలం పూర్తయింది. సోషల్ మీడియాలో నలిగిపోయిన ఈ సబ్జెక్ట్ పై ఇప్పుడు అరిగిపోయిన రికార్డ్ ని సాక్షి వినిపించినట్టయింది. ప్రతిదాడి బలంగా చేయాల్సిన సమయంలో బురద కడుక్కోడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టయింది. పైగా ఇక్కడ చంద్రబాబుని విమర్శించాలా, రామోజీని ఎండగట్టాలా అనే ఊగిసలాట కూడా ఎక్కువైంది. మొత్తానికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తే సాక్షి కూడా స్పందిస్తుంది అనిపించుకుంది అంతే, అంతకు మించి ఏమాత్రం ప్రత్యేకత కనిపించలేదు, వినిపించలేదు.

First Published:  9 Sept 2023 6:59 AM IST
Next Story