చంద్రబాబు ఒక క్లాసికల్ దొంగ -సజ్జల
అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలివ్వడం, అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేయడం చంద్రబాబుకి అలవాటని అన్నారు సజ్జల.
క్లాసికల్ గా దొంగతనం చేయడంలో చంద్రబాబు నేర్పరి అని ఎద్దేవా చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఐఎంజీ భూముల స్కామ్ లో ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బాబు బండారం మరోసారి బయటపడిందని చెప్పారాయన. ఆ తీర్పు గురించి ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయలేదని నిలదీశారు సజ్జల. వాస్తవానికి అప్పట్లోనే చంద్రబాబు జైలుకెళ్లేవారని, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయవల్ల బాబుకి చిప్పకూడు గతి తప్పిందని, కానీ స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి ఇన్నాళ్లకు బాబు జైలుపాలయ్యారని చెప్పారు. చంద్రబాబు అంతర్జాతీయ స్కామ్ స్టర్ అని మండిపడ్డారు సజ్జల.
2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోసం హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో చంద్రబాబు అక్రమంగా 850 ఎకరాల భూమిని కట్టబెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దుచేయగా.. కంపెనీ తరపున యజమాని బిల్లీరావు కోర్టు మెట్లెక్కారు. ఆ కేసులో 20 ఏళ్ల తర్వాత తాజాగా తీర్పు వచ్చింది. చంద్రబాబు చేసిన కేటాయింపులు తప్పు అని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఇప్పుడు కూడా చంద్రబాబు అమరావతి విషయంలో ఇలాగే భూ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు సజ్జల. అమరావతిలో కూడా 1700 ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారని, ఐఎంజీ స్కామ్ లాగే అమరావతి స్కామ్ జరిగిందని అన్నారు. రైతుల నుండి భూములు తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారన్నారు. చివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పుడు పనులు చేసి చంద్రబాబు జైలు పాలయ్యారని చెప్పారు సజ్జల.
అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే, ఇప్పుడు జగన్ అమరావతి స్కామ్ ని బయటపెట్టారని చెప్పారు సజ్జల. జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేసేవారన్నారు. 2024లో బాబుకి అధికారం ఇస్తే రాష్ట్రాన్నే కనపడకుండా చేస్తారన్నారు. అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలివ్వడం, అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేయడం చంద్రబాబుకి అలవాటని అన్నారు సజ్జల.
అంపశయ్యపై టీడీపీ..
ప్రస్తుతం ఏపీలో టీడీపీ అంపశయ్యపై ఉందని, ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా బాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు సజ్జల. ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ తో కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు పొత్తులను చూస్తుంటే వైసీపీకి ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం అన్నారు సజ్జల. మిగతా అన్ని పార్టీలు కలిసినా ఏపీలో అధికారం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.