Telugu Global
Andhra Pradesh

అంగన్‌వాడీలు వారి వలలో చిక్కుకోవద్దు.. - సజ్జల విజ్ఞప్తి

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నవారంతా అంగన్‌వాడీలను రెచ్చగొడుతున్నారని సజ్జల తెలిపారు. అంగన్‌వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన చెప్పారు.

అంగన్‌వాడీలు వారి వలలో చిక్కుకోవద్దు.. - సజ్జల విజ్ఞప్తి
X

అంగన్‌వాడీలను కొంతమంది రాజకీయ కోణంలో రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వారి వలలో చిక్కుకోవద్దని ఆయన అంగన్‌వాడీలకు సూచించారు. తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

పట్టు వీడకపోతే ప్రత్యామ్నాయం వైపే..

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నవారంతా అంగన్‌వాడీలను రెచ్చగొడుతున్నారని సజ్జల తెలిపారు. అంగన్‌వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన చెప్పారు. వాట్సాప్‌ గ్రూపుల్లో వారి ఆడియోలు తాము విన్నామని తెలిపారు. కొంతమంది రాజకీయ అజెండాకు అంగన్‌వాడీలు బలి కావద్దని ఆయన సూచించారు. గర్భిణులు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్టొద్దని, పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుందని ఆయన తెలిపారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని, ఇది సరికాదని చెప్పారు.

అంగన్‌వాడీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు...

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్‌వాడీలకు అన్యాయం చేశారని సజ్జల గుర్తుచేశారు. సమ్మె ప్రభావం వల్ల పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా అనే విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులను కోరుతున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇంకా సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తామని, ఆ తర్వాత ఏ స్టెప్‌ తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ముందే కారణాలు వెతుక్కుంటున్నారు..

టీడీపీ నేతలు ఓటమి తప్పదని ఊహించడం వల్లే ముందుగా కారణాలు వెతుక్కుంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. గతంలో కూడా ఓడిపోగానే ఈవీఎంలపైకి నెట్టారని ఆయన గుర్తుచేశారు. వలంటీర్లు ఉద్యోగులు కాదని, అలాంటప్పుడు వారు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అయినా ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్థులు లేరని, జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదని ఆయన చెప్పారు. వైసీపీ కాన్ఫిడెంట్‌గా సీట్లపై నిర్ణయాలు తీసుకుంటోందని సజ్జల తెలిపారు. గంటా శ్రీనివాసరావు, అనిత, జవహర్‌ ఇలా ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు మారారో తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు.

First Published:  9 Jan 2024 2:34 AM GMT
Next Story