Telugu Global
Andhra Pradesh

అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకి స్థ‌లం ఇస్తాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో ఎదురైన ఇబ్బందులన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జర్నలిస్టులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని సజ్జల వివరించారు.

అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకి స్థ‌లం ఇస్తాం
X

అర్హులైన ప్రతి జర్నలిస్టుకీ ఇళ్ల స్థలాల జీవో ద్వారా న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో తనను కలిసిన అక్రెడిటెడ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యులకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ జీవోలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. పలు అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు. వాటిలో కీలకాంశాలేమిటంటే..

ఇటీవల కాలంలో జగనన్న ఇళ్ల పథకం ద్వారా సెంటు స్థలం పొందినవారు, గతంలో టిడ్కో ఇల్లు గాని, మరే ఇతర ప్రభుత్వ పథకంలో ఇంటి స్థలం లబ్ధి పొందిన జర్నలిస్టులు గాని వాటిని తిరిగి ప్రభుత్వానికి సరెండర్‌ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తద్వారా జర్నలిస్ట్‌ హౌసింగ్‌ పథకానికి అర్హులుగా పరిగణించేలా చూస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల జీవోకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా రూపొందించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పారదర్శకంగా అందించేందుకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో ఎదురైన ఇబ్బందులన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జర్నలిస్టులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని సజ్జల వివరించారు. ప్రభుత్వమే లే ఔట్‌ వేసి డెవలప్‌మెంట్‌ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, అందుకయ్యే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. గతంలో ఈ డెవలప్‌మెంట్‌ ఖర్చు సొసైటీలు భరించేవని, ఇప్పుడు అందులోనూ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న విషయాన్ని గమనించాలని కోరారు. జిల్లాల వారీగా ప్రభుత్వ స్థలాలు గుర్తించి వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో త్వరలో స్క్రూటినీ కమిటీని నియమిస్తామని, అందులో జర్నలిస్టులకి భాగస్వామ్యం కల్పిస్తామని, ఆ కమిటీ నిర్ణయం మేరకే స్థలాల ఎంపిక ఉంటుందని సజ్జల వివరించారు. ఈ ఏడాది అక్రిడేషన్‌ లేనివారికి సీనియారిటీ ప్రాతిపదికన స్థలాలు కేటాయించే అంశం కూడా పరిశీలనలో ఉందని సజ్జల తెలిపారు. జర్నలిస్టులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వారిలో విశాఖ అక్రెడిటెడ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ నేతలు ఉన్నారు.

First Published:  2 Dec 2023 7:37 AM IST
Next Story