ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురు గెస్ట్ ఆర్టిస్ట్ లు
చాలామందికి పుట్టిన తర్వాత మానసిక వైకల్యం ఉన్నట్టు గుర్తిస్తామని, కానీ నారా లోకేష్ కి గర్భంలోనే వైకల్యం వచ్చి ఉంటుందన్నారు సజ్జల. లోకేష్ ది చిల్లర వ్యవహారమన్నారు.
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ముగ్గురూ గెస్ట్ ఆర్టిస్ట్ లే అని ఎద్దేవా చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయన్నారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే కానీ, ఆయన ప్రవర్తన మాత్రం విచిత్రంగా ఉంటుందన్నారు. అంత అనుభవం ఉన్న చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో జగన్ పొగిడారంటూ తనకు తానే బాకాలూదుకుంటున్నారని, అదేం విచిత్రం అని ప్రశ్నించారు సజ్జల.
బాబు ఢిల్లీ పర్యటనపై..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కూడా సజ్జల స్పందించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కట్టే బ్యాచ్.. ఇప్పుడు చంద్రబాబు పర్యటన గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. బీజేపీతో కలవడానికి బాబు వెంపర్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు సజ్జల.
గర్భంలోనే వైకల్యం..
చాలామందికి పుట్టిన తర్వాత మానసిక వైకల్యం ఉన్నట్టు గుర్తిస్తామని, కానీ నారా లోకేష్ కి గర్భంలోనే వైకల్యం వచ్చి ఉంటుందన్నారు సజ్జల. లోకేష్ ది చిల్లర వ్యవహారమన్నారు. యువగళం అంటూ యాత్ర చేస్తున్న లోకేష్, చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కింది స్థాయి కార్యకర్తలు ఇలాంటి పని చేస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ లోకేష్ ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.
పవన్ ని తిరగమనే చెబుతున్నాం..
పవన్ కల్యాణ్ కి ప్రజల్లోకి వచ్చి యాత్రలు చేయొద్దు అని ఎవరూ చెప్పలేదని, తాము కూడా ఆయన్ని ప్రజల్లో తిరగాలనే చెబుతున్నామన్నారు. అలా తిరిగితేనే ప్రజల్లో వైసీపీపై ఉన్న విశ్వసనీయత పవన్ కి కూడా అర్థమవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా వారాహి షెడ్యూల్ ఇచ్చారు కానీ, ఆయన ఎంత వరకు తిరుగుతారో నమ్మకం లేదన్నారు. తన కొడుకు లోకేష్ కి అడ్డం వస్తాడని చంద్రబాబు ఇంతకు ముందు పవన్ కల్యాణ్ యాత్రను ఆపేశారని చెప్పారు. కేవలం ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజలు అంగీకరించరన్నారు సజ్జల.