చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ది స్క్రిప్టెడ్ రాజకీయం : సజ్జల రామకృష్ణారెడ్డి
విశాఖ గర్జన రోజే పవన్ అక్కడ పర్యటన చేపట్టి రసాభస చేశారని గుర్తు చేశారు. ఇప్పటంలో కూడా ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని సజ్జల చెప్పారు. పవన్ కావాలనే ఇలా చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షాలు కలిసి పని చేయడంలో తప్పు లేదని.. అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసేవి అన్నీ స్క్రిప్టెడ్ రాజకీయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇప్పటం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ ఎందుకు అంత ఆవేశం ప్రదర్శించారో అర్థం కాలేదని సజ్జల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలపై ఆయన స్పందించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ప్రతీ సారి రాష్ట్రంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ గర్జన రోజే పవన్ అక్కడ పర్యటన చేపట్టి రసాభస చేశారని గుర్తు చేశారు. ఇప్పటంలో కూడా ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని సజ్జల చెప్పారు. పవన్ కావాలనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కలవడం ఒక చారిత్రక అవసరమని ఒక కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో పవన్, చంద్రబాబు కలసి ప్రజలను మోసం చేశారని అన్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిలో ఒక్కరి ఇల్లు కూడా కూల్చలేదని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పటంలో పర్యటనకు పవన్ వెళ్లడానికి ముందు రోజే చంద్రబాబుపై రాయితో దాడి జరిగినట్లు డ్రామా ఆడారని అన్నారు.
రాష్ట్రంలో ఏదో జరుగుతుందని ప్రజలను నమ్మించేలా కావాలని ఇలాంటి ఘటనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు, పవన్ చేస్తొన్న హడావిడి అని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అయ్యాయనే రీతిలో వారు అబద్దాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రావాలనుకునే పార్టీలు ఇలా వ్యవహరిస్తాయా అని సజ్జల మండి పడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏనాడూ విడిపోలేదని.. మొదటి నుంచి వాళ్లు కలిసే ఉన్నారన్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలనే ఉద్దశంతోనే టీడీపీకి పవన్ దూరమయ్యాడని ఆరోపించారు.
ఇప్పుడేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటంలో ఒక్క గోడ కూడా కూల్చలేదని సజ్జల చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రతీ రోజు ధర్నాలు, ఆందోళనలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, ఇటీవల ఇప్పటంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అప్పడు మౌనంగానే ఉన్న సజ్జల తాజాగా ఆ విమర్శలపై స్పందించారు.