ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరు..? సజ్జల సూటి ప్రశ్న..
పవన్ మూడు ఆప్షన్లు వింటే నవ్వొస్తుందని, షరతులు లేకుండా చంద్రబాబు చెప్పినట్టు వినడం అనే నాలుగో ఆప్షన్ కూడా పవన్ బయట పెట్టాలన్నారు సజ్జల.
ఏపీలో వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. అందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవన్నారాయన. అదే సమయంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరని నిలదీశారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థా..? వారాహి యాత్ర చేస్తానంటున్న పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థా..? లేక చంద్రబాబు సీఎం క్యాండిడేట్ గా బరిలో దిగుతారా అని ప్రశ్నించారు. ముందు సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు.
నాలుగో ఆప్షన్ కూడా చెబుతావా పవన్..
కొండగట్టులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు సజ్జల. ఇప్పటికింకా బీజేపీతో పొత్తులోనే ఉన్నామని, బీజేపీ కాదంటే వేరేవాళ్లతో వెళ్తామని, కుదరకపోతే ఒంటరిగా వెళ్తామని చెబుతున్న పవన్ కల్యాణ్, తన నాలుగో ఆప్షన్ కూడా చెబితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పవన్ మూడు ఆప్షన్లు వింటే నవ్వొస్తుందని, షరతులు లేకుండా చంద్రబాబు చెప్పినట్టు వినడం అనే నాలుగో ఆప్షన్ కూడా పవన్ బయట పెట్టాలన్నారు. పవన్ రిమోట్ ఎప్పుడూ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని చెప్పారు సజ్జల.
ఎన్నికల్లో పోటీపై, సీఎం అభ్యర్థిపై తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని, ప్రతిపక్షాలు కూడా క్లారిటీతో రావాలన్నారు. పోనీ టీడీపీ, జనసేన సీఎం కుర్చీని చెరి రెండున్నరేళ్లు పంచుకుంటామని అయినా చెప్పాలన్నారు. లోకేష్ పాదయాత్రను టీడీపీ చాలా ఎక్కువగా ఊహించుకుంటోందని ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ధైర్యంగా జనసేన చెప్పుకోలేకపోతోందన్నారు. వారు విడివిడిగా వచ్చినా, కలివిడిగా వచ్చినా వైసీపీదే విజయం అన్నారు.