Telugu Global
Andhra Pradesh

జగన్ కు ముందే తెలుసు - సీబీఐ.. ఇది ఎల్లో స్క్రిప్ట్ - సజ్జల

ఇది వరకు విచారణకు వచ్చిన సమయంలో అవినాష్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇచ్చారని, లోతైన కుట్ర కోణాన్ని వెల్లడించేందుకు ఆయన సహకరించడం లేదని కాబట్టి కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాల్సి అవసరం ఉందని కోర్టుకు తెలిపింది.

జగన్ కు ముందే తెలుసు - సీబీఐ.. ఇది ఎల్లో స్క్రిప్ట్ - సజ్జల
X

సీబీఐ తొలిసారిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ పేరును ప్రస్తావించింది. వివేకానందరెడ్డి మరణం గురించి బయటి ప్రపంచానికి తెలియకముందే, గుండెపోటు అంటూ పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే జగన్‌మోహన్ రెడ్డికి సమాచారం అందిందని సీబీఐ హైకోర్టుకు వివరించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. అందులో ఈ విషయాన్ని ప్రస్తావించింది.

హత్యకు కొద్ది సేపటి ముందు అంటే 2019 మార్చి 14 అర్ధ‌రాత్రి దాటిన తర్వాత 12.27 నుంచి 1.10 గంటల వరకు అవినాష్ రెడ్డి వాట్సాప్‌ కాల్స్ మాట్లాడినట్టు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్‌ రికార్డును విశ్లేషించడంతో తేలిందని సీబీఐ వివరించింది. హత్య తర్వాత తెల్లవారుజామున 4.11 గటలకు తిరిగి వాట్సాప్ కాల్స్‌ మాట్లాడుతూ అవినాష్ రెడ్డి బీజీగా గడిపారని వెల్లడించింది. హత్య జరిగిన తర్వాత కీలక నిందితుడైన సునీల్ యాదవ్ తిరిగి అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చినట్టు మొబైల్ లొకేషన్ ద్వారా నిర్ధారించినట్టు చెప్పింది. వివేకా హత్యకు ముందు, హత్యకు తర్వాత అవినాష్ రెడ్డి చాలా యాక్టివ్‌గా ఫోన్‌లో గడిపారని చెబుతోంది.

ఆరోజు తాను జమ్మలమడుగు వెళ్తుంటే సమాచారం రావడంతో మార్గమధ్యలో వెనక్కు వచ్చానని అవినాష్ రెడ్డి చెబుతున్నారని అది అబద్ధ‌మని సీబీఐ వెల్లడించింది. జగన్‌మోహన్ రెడ్డి సమాచారం అవినాష్ రెడ్డి ద్వారానే వెళ్లిందా అన్నది విచారించాల్సి ఉందని.. అందుకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదని తెలిపింది. ఈనెల 22న అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్లామని కానీ, ఆస్పత్రి వద్ద అవినాష్ రెడ్డి అనుచరుల తీరు చూసిన తర్వాత శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించామని కోర్టుకు వివరించింది.

ఇది వరకు విచారణకు వచ్చిన సమయంలో అవినాష్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇచ్చారని, లోతైన కుట్ర కోణాన్ని వెల్లడించేందుకు ఆయన సహకరించడం లేదని కాబట్టి కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాల్సి అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. ఈనెల 19న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇస్తే రాలేదని.. దాంతో తాము ఫోన్ చేసి రావాల్సిందిగా కోరామని హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ రాకుండా తల్లి అనారోగ్యం అంటూ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారని సీబీఐ వివరించింది. దాంతో అవినాష్ రెడ్డి విషయంలో కడప ఎస్పీ సాయం కూడా ముందే కోరామని.. కానీ అవినాష్ రెడ్డి కడప వెళ్లకుండా కర్నూలులో ఆగిపోయారని చెప్పింది. దాంతో కర్నూలు ఎస్పీ సాయం కూడా కోరామంది. కానీ ఆస్పత్రి వద్ద అవినాష్ రెడ్డి అనుచరులు ఉండటంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించామంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడుపు ప్రకారం జూన్ 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉందని.. కానీ అవినాష్ మాత్రం పదేపదే గైర్హాజరవుతూ విచారణకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సీబీఐ తన అదనపు కౌంటర్‌లో వివరించింది.

సీబీఐ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. సీబీఐ తీరు చిల్లరగా, పిల్ల చేష్టల తరహాలో ఉందని ఆరోపించారు. హఠాత్తుగా జగన్‌ పేరును ఈ కేసులో చేర్చడం చిల్లర పనేనన్నారు. ఏపీలో రాజకీయంగా ఏదో సంచలనం సృష్టించడానికే సీఎం పేరును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. హత్యతో సంబంధం లేని అవినాష్ రెడ్డిని విచారణ పేరుతో సీబీఐ వేధిస్తోందని విమర్శించారు. అవినాష్ రెడ్డిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతో దర్యాప్తు సంస్థ పనిచేస్తోందన్నారు. ఎల్లో మీడియా చెబుతున్నదే సీబీఐ చెబుతోందన్నారు.

First Published:  27 May 2023 8:24 AM IST
Next Story