Telugu Global
Andhra Pradesh

మాది రిస్క్ కాదు, ప్రజలపై నమ్మకం

జగన్‌పై ప్రజలకు, ప్రజలపై జగన్‌కు ఉన్న నమ్మకమే వైసీపీని తిరిగి గెలిపిస్తుందన్నారు సజ్జల.

మాది రిస్క్ కాదు, ప్రజలపై నమ్మకం
X

వైసీపీ మేనిఫెస్టోలో ఈసారి ఆకర్షణీయ పథకాలు లేవని, ఉన్నవాటినే కొనసాగిస్తామని చెప్పారని, వాటితో పోల్చి చూస్తే టీడీపీ మేనిఫెస్టో అదిరిపోయే పథకాలను ప్రకటించిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాన్ని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. మేనిఫెస్టో విషయంలో తాము చేసింది రిస్క్ కాదని, తమకి ప్రజలపై నమ్మకం ఉందన్నారాయన. జగన్‌పై ప్రజలకు, ప్రజలపై జగన్‌కు ఉన్న నమ్మకమే వైసీపీని తిరిగి గెలిపిస్తుందన్నారు సజ్జల.

కూటమి మేనిఫెస్టో వైసీపీని అనుకరించినట్లు ఉందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. వారి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదని, జగన్ జర్నీని ప్రజలంతా గమనించారని వివరించారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరిందని, ఆయన చెప్పింది చేస్తారనే భావన ప్రజల్లో ఉందని అందుకే ఈసారి కూడా మేనిఫెస్టోలో ఆ పథకాలను కొనసాగిస్తామని చెప్పామన్నారు సజ్జల.

సీపీఎస్‌ రద్దు, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం వంటి హామీలపై తాము ఏంచేశామనే విషయాన్ని తామే ఒప్పుకుంటున్నామన్నారు సజ్జల. అందుకే 99 శాతం హామీలను నెరవేర్చామని చెబుతున్నామని, అవి కూడా అమలై ఉంటే 100 శాతం అని చెప్పేవాళ్లం కదా అన్నారు. జస్ట్‌ మాట చెప్పడమే అయితే ఇంకా లక్ష కోట్లు ప్రకటించుకోవచ్చన్నారు. 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఉంటే ఆ రోజే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు. ఏం చేయగలమో అదే చెప్పాం, చెబుతున్నామన్నారు సజ్జల. సీపీఎస్ ను ఇప్పటికీ వదిలేయలేదన్నారు. ఇక ప్రత్యేక హోదా అనేది తమతో మాత్రమే పూర్తయ్యే పని కాదని, అది ఏకపాత్రాభినయం కాదని, కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుండా ఉంటే, ఏపీ తరపున కచ్చితంగా ఒత్తిడి తెచ్చి సాధించుకునే అవకాశముందన్నారు. మద్యపాన నిషేధం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదని, అందుకే నియంత్రణ దిశగా అడుగులు వేశామన్నారు సజ్జల.

చంద్రబాబు వర్చువల్ గా తప్ప రియల్ గా ఏమైనా చేశారా అని ప్రశ్నించారు సజ్జల. ఆయన తన సొంత సంపద పెంచుకున్నారే కానీ, సంపద సృష్టించలేదన్నారు. ఓట్లకోసమే అయితే తాము రైతు రుణమాఫీ అనే హామీ ఇచ్చేవాళ్లమని, కానీ రైతులు తమ సొంత కాళ్లపై నిబలడే విధంగా తాము సహకారం అందిస్తున్నామని వివరించారు సజ్జల.

First Published:  1 May 2024 11:15 AM IST
Next Story