వాళ్ల మైక్ ఫెయిలైనా తప్పు మాదేనా..? -సజ్జల
సీఎం జగన్ పై రాష్ట్ర ప్రజలకు బలమైన నమ్మకం ఉందన్నారు సజ్జల. విశ్వసనీయతకు వారెంటీ అవసరం లేని గ్యారెంటీ జగన్ అని చెప్పారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం సభపై వైసీపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ప్రధాని ప్రసంగం సమయంలో మైక్ పనిచేయలేదని, పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని అంటున్నారు. ఎల్లో మీడియా కూడా ఈ వ్యవహారాన్నే హైలైట్ చేస్తోంది. చివరిగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ సహా.. మరికొందరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని లేఖ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ పై వైసీపీ తాజాగా స్పందించింది. కూటమి సభలో మైక్ పనిచేయకపోయినా తప్పు మాదేనా..? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
చిలకలూరిపేటలో కూటమి సభ ఫెయిల్ అయిందని, వాళ్ల మైక్ సిస్టం ఫెయిల్ అయితే, పోలీసులకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు సజ్జల. పొరపాటున కరెంట్ పోతే.. ఆ నింద కూడా తమపై వేసేవాళ్లని చెప్పారు. ప్రధానికి మోదీకి సన్మానం అని ప్రకటించినా శాలువా రాలేదని ఇదెక్కడి విచిత్రం అని అన్నారు సజ్జల. కూటమి సభలో మూడు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాల్సిందన్నారాయన. ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
వారెంటీ అవసరం లేని గ్యారెంటీ..
సీఎం జగన్ పై రాష్ట్ర ప్రజలకు బలమైన నమ్మకం ఉందన్నారు సజ్జల. విశ్వసనీయతకు వారెంటీ అవసరం లేని గ్యారెంటీ జగన్ అని చెప్పారు. చెప్పిన దాని కంటే జగన్ ఎక్కువే చేశారన్నారు. కేవలం జగన్ పై దుమ్మెత్తి పోయడమే ఆ మూడు పార్టీల నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఏం చేశారో చెప్పలేదని, పోనీ గెలిస్తే ఏం చేస్తారనే విషయంపై వారికి క్లారిటీ లేదన్నారు. చంద్ర బాబు కూటమి మోసపూరిత పాలన ఓ వైపు, విశ్వసనీయత ఉన్న జగన్ పాలన మరోవైపు ఉందని.. ప్రజలు ఏవైపు ఉండాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. రాబోయే ఐదేళ్లు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ పాలనే రావాలన్నారు సజ్జల.