CPI: చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా
సీపీఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అని కొత్త అర్థం చెప్పారు సజ్జల. కమ్యూనిస్ట్ లు భూ పోరాటాలు చేస్తారని, కానీ అమరావతిలో పేదలకు భూపంపిణీ చేస్తుంటే అడ్డుపడుతున్నారని, కోర్టులో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, చంద్రబాబుని అధికారంలోకి తేవడానికి అంత తొందర ఎందుకు పడుతోందో అర్థం కావడంలేదని అంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీపీఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అని కొత్త అర్థం చెప్పారు. కమ్యూనిస్ట్ లు భూ పోరాటాలు చేస్తారని, కానీ అమరావతిలో పేదలకు భూపంపిణీ చేస్తుంటే అడ్డుపడుతున్నారని, కోర్టులో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో వామపక్షాల అజెండా ఏంటని ప్రశ్నించారు.
బల్లకింద నక్కి విన్నారా..?
అమిత్ షా తో జగన్ భేటీ వివరాలను బల్లకింద నక్కి సీపీఐ నారాయణ విన్నారా అని ప్రశ్నించారు సజ్జల. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జగన్, బీజేపీకి సహాయం చేస్తానని మాటిచ్చినట్టు, దానికి ప్రతిగా అవినాష్ రెడ్డిని వివేకా హత్యకేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు నారాయణ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలన్నీ అవాస్తవం అని కొట్టిపారేశారు సజ్జల. చిల్లర కామెంట్లు చేసి స్థాయి దిగజార్చుకోవద్దని హితబోధ చేశారు. టీకొట్ల దగ్గర మాట్లాడుకునే మాటల్ని నారాయణ వల్లెవేయడం హాస్యాస్పదం అన్నారు.
అమరావతి ఉద్యమం కృత్రిమమైనదని మరోసారి ఆరోపించారు సజ్జల. దాని వెనక టీడీపీ ఉన్నదని అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు వారికి మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు తాను చట్టానికి అతీతుడిని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతరుల ఆఫీసుల్లో సోదాలు జరిగితే అది ఈనాడుకి వార్త అవుతుందని, మార్గదర్శి ఆఫీస్ లో సోదాలు జరిగితే మాత్రం ప్రతీకారం అంటూ కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. రామోజీరావుకి ప్రత్యేక రాజ్యాంగం ఏదీ ఉండదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.