మూడు రాజధానులతోనే అభివృద్ధి.. తప్పంతా గత ప్రభుత్వానిదే
విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
ఏపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సజ్జలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన పార్టీ అంతర్గత రాజకీయాలపై స్పందించలేదు, మూడు రాజధానుల వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు తప్పనిసరి అని అన్నారు సజ్జల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
విభజన సమస్యలపై కూడా సజ్జల మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు సజ్జల.
పెట్టుబడులపై విషం ఎందుకు..?
ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో వెనకపడిందని, స్టార్టప్ ల విషయంలో బీహార్ ని కూడా దాటలేకపోయిందని ఇటీవల చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ ఇచ్చారు సజ్జల. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే కొందరు ఓర్వ లేకపోతున్నారని అన్నారు. ఇండస్ట్రీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే విషం కక్కుతున్నారని, ఏ పెట్టుబడి వచ్చినా వారంతా సీఎం జగన్ కు బంధువులని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదన్నదే ఎల్లో మీడియా తాపత్రయమని, బరితెగించి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పద్దతి లేకుండా అనుమతులు ఇచ్చిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు తమను బాధ్యుల్ని చేస్తున్నారని సజ్జల విరుచుకుపడ్డారు.