రౌడీయిజం, మీడియా టెర్రరిజం కలిస్తే ఆర్డీఎక్స్ కంటే ప్రమాదకరం –సజ్జల
వాళ్ల మాటలతో వల్లభనేని వంశీయే స్వయంగా అక్కడకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని, కానీ వంశీ నేరుగా వెళ్లకపోవటం, సంయమనం పాటించడమేనన్నారు సజ్జల.
వ్యవస్థలను మీడియా ద్వారా రిమోట్ కంట్రోల్ తో మేనేజ్ చేయగలం అని గుర్తించిన వ్యక్తి ఓ మీడియా సంస్థ అధినేతగా ఉన్నారంటూ మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మీడియా సంస్థ అధినేత విపరీత ఆలోచనా ధోరణి ఇప్పుడు మరింత వికృత రూపం దాల్చిందని అన్నారు. తానే ప్రపంచాన్ని శాసించాలనే స్వభావంతో ఆయన ఉన్నారని, దాని విష ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కనపడుతోందని చెప్పారు. రౌడీయిజం, మీడియా టెర్రరిజం కలిస్తే ఆర్డీఎక్స్ కంటే ప్రమాదం అన్నారు సజ్జల.
గన్నవరం ఘటన జరగకుండా ఉండాల్సింది..
గన్నవరం ఘటన జరగకుండా ఉండాల్సిందని అన్నారు సజ్జల. ఆ ఘటనను తాము సమర్ధించటం లేదని, కానీ ముందుగా రెచ్చగొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. విజయవాడలో ఉండే పట్టాభి గన్నవరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని నిలదీశారు. వాళ్ల మాటలతో వల్లభనేని వంశీయే స్వయంగా అక్కడకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని, కానీ వంశీ నేరుగా వెళ్లకపోవటం, సంయమనం పాటించడమేనన్నారు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని, టీడీపీ హయాంలో ఉన్నట్లుగా ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాము సంయమనంతో వ్యవహరించామని గుర్తు చేశారు సజ్జల.
అప్పట్లో టీడీపీ శిక్షణా శిబిరంలో చంద్రబాబు సమక్షంలో చెంగల్రాయుడు.. ఏ రకంగా మాట్లాడారో చూస్తే వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుందన్నారు సజ్జల. అబద్ధాలు చెప్పి న్యాయ వ్యవస్థను ఎలా తప్పుదారి పట్టించాలో చెంగల్రాయుడు వివరించాడు కదా అని అన్నారు. పట్టాభిని ఆంబోతును మేపినట్లు చంద్రబాబు మేపుతున్నాడని మండిపడ్డారు సజ్జల. బూతుల్లో పోటీ పెడితే పట్టాభికి డిస్టింక్షన్ వస్తుందన్నారు. టీడీపీ ఎప్పుడూ ధర్మయుద్ధం చేయలేదని, విజయానికి షార్ట్ కట్స్ వెదుకుతుందని, ప్రచారం కోసం తాపత్రయ పడుతుందని చెప్పారు సజ్జల.