ఇంట్లో ఉండేందుకయితే అరెస్ట్ ఎందుకు..?
బాబును హింసిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు సజ్జల. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావిడి అన్నారు. టీడీపీ హడావిడితో అసలు విషయం పక్కకి పోతోందని, గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపోవన్నారు.
చంద్రబాబు జైలులో ఉండటం తప్పా అని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంట్లో ఉండేందుకయితే అసలు అరెస్ట్ ఎందుకని ప్రశ్నించారు. ఆ సంబడానికి అరెస్ట్ చేయడమెందుకంటూ సెటైర్లు పేల్చారు. రాజకీయ కక్షతో ఆయన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లమని చెప్పారాయన. చంద్రబాబు అరెస్ట్ కి, రాజకీయాలకు సంబంధమేంటన్నారు.
జైలులో సౌకర్యాలు..
చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పటినుంచి జైలుకు వెళ్లేవరకు, చివరకు జైలులో కూడా బెస్ట్ సౌకర్యాలు కల్పించామన్నారు సజ్జల. హెలికాప్టర్లో తీసుకెళ్తామంటే ఆయనే వద్దన్నారని, రోడ్డు పొడవునా చేయి ఊపుతూ రావాలనుకున్నారని, కానీ కుదర్లేదని ఎద్దేవా చేశారు. చివరకు జైలులో కూడా ఆయనకు ఇంటి భోజనమే ఇస్తున్నారు కదా అని అడిగారు. ఇంట్లోనే ఉంటానంటే ఇక అరెస్ట్ చేయడమెందుకన్నారు. ఇంట్లో ఉండి ఫోనుల్లో మాట్లాడుకుంటూ రాజకీయాలు చేయడం కోసమే ఆ ప్రయత్నమా అని ప్రశ్నించారు సజ్జల.
బాబును హింసిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు సజ్జల. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావిడి అన్నారు. టీడీపీ హడావిడితో అసలు విషయం పక్కకి పోతోందని, గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపోవన్నారు. దేశంలో ఉండే చట్టాలకు చంద్రబాబు అతీతుడా? అని ప్రశ్నించారు. తప్పు చేసి పక్కా ఆధారాలతో అరెస్ట్ అయిన తర్వాత, దాన్ని కూడా సానుభూతి కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు సజ్జల.
2019 ఏప్రిల్ లోనే సీమెన్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిందని, సీమెన్స్ ప్రతినిధులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని, ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని అంటున్నారని చెప్పారు సజ్జల. డబ్బులన్నీ టెక్ డిజైన్ కు వెళ్లిందని, అక్కడి నుంచి షెల్ కంపెనీలకు మళ్లిందని ఈడీ కూడా హవాలా వ్యవహారంపై దర్యాప్తు చేసిందన్నారు. చంద్రబాబు అవినీతికి అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు సజ్జల. గట్టిగా అరిస్తే అబద్ధం నిజం అయిపోదన్నారు. చంద్రబాబు అవినీతి నిరూపణకు పెద్ద పెద్ద లాయర్లు పెద్ద జ్ఞానం అవసరం లేదని, సామాన్యులను అడిగినా చెబుతారన్నారు సజ్జల.