ఎన్నికల కోసం గుంటనక్కలు రెడీ.. సజ్జల హాట్ కామెంట్స్
నాలుగేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధిని చూసి ఆ గుంటనక్కలు తట్టుకోలేకపోతున్నాయని, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చూసి వాటికి కడుపుమండిపోయిందని అన్నారు. జనాల్ని మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ దత్త పుత్రుడితో కలసి వస్తున్నాడని చెప్పారు సజ్జల.
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ కటింగ్ లు, జగన్ ఫొటోలకు పాలాభిషేకాలతో సందడి చేస్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమసమాజాన్ని నిర్మించే పనిలో సీఎం జగన్ ఉన్నారని, అభివృద్ధి.. సంక్షేమం అంటే ఏంటో అసలైన అర్థం చెప్పారని కొనియాడారు.
గుంటనక్కలు రెడీ..
మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న సమయంలో గుంటనక్కలు ప్రజల్ని మభ్యపెట్టడానికి సిద్ధమవుతున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు సజ్జల. నాలుగేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధిని చూసి ఆ గుంటనక్కలు తట్టుకోలేకపోతున్నాయని, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చూసి వాటికి కడుపుమండిపోయిందని అన్నారు. జనాల్ని మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ దత్త పుత్రుడితో కలసి వస్తున్నాడని చెప్పారు.
చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నేర్పరి అని.. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం చేశారో ప్రజలు మరచిపోలేదన్నారు సజ్జల. అన్న క్యాంటిన్ పేరుతో ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశానని చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆఖరికి మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా ముడుపులు తీసుకున్నాడని విమర్శించారు. తాము ప్రవేశ పెట్టిన అమ్మ ఒడిని కాపీ కొట్టి, అమ్మకు వందనం పేరుతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ని దొంగదెబ్బ తీసి టీడీపీని ఆక్రమించిన చంద్రబాబు, ప్రజలకు మేలు చేస్తాడని ఏ ఒక్కరూ అనుకోరని చెప్పారు.
పెద్దాయన పేరు నిలబెట్టేలా..
వైఎస్ఆర్ అంశ జగన్ అని, ఆయన పేరు నిలపెట్టేలా ఏపీ ప్రజలకు జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు సజ్జల. వైసీపీ కార్యకర్తలంతా జగన్ కుటుంబ సభ్యులేనన్నారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొత్తుల పాచికలతో చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని, వాటిని చిత్తు చేయాలని పిలుపునిచ్చారు.