Telugu Global
Andhra Pradesh

మూడంటే మూడే.. బుగ్గన వ్యాఖ్యలకు సజ్జల వివరణ

రాజధాని అనే పేరు పెట్టుకున్నా, లేకపోయినా మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ఎజెండా అని చెప్పారు. ఎన్నికల కోసం రాజధాని అనే నినాదం తామెప్పుడూ తెరపైకి తేలేదన్నారు.

మూడంటే మూడే.. బుగ్గన వ్యాఖ్యలకు సజ్జల వివరణ
X

ఏపీకి మూడు రాజధానులు లేవు, ఉన్నది ఒక్కటే.. అదే విశాఖ అంటూ బెంగళూరులో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఇన్నాళ్లూ వైసీపీ డ్రామాలాడిందని, ఇప్పుడు బుగ్గన అసలు విషయం బయటపెట్టారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు మొదలుపెట్టాయి. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఏపీకి మూడు రాజధానులుంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

బెంగళూరులో ఆర్ధికమంత్రి బుగ్గన మాట్లాడిన మాటలు అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో చంద్రబాబు హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఒకే చోట పెట్టి రాజధాని అన్నారని, జగన్ సీఎం అయిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం మూడు ప్రాంతాల్లో రాజధాని పెట్టాలని అనుకున్నామని చెప్పారు సజ్జల. వైజాగ్ లో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు.. ఇదే తమ విధానం అన్నారు. బుగ్గన వ్యాఖ్యల్లో వైరుధ్యం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు.

మూడంటే మూడే..

అప్పుడూ ఇప్పుడూ వైసీపీ విధానం ఒకటేనని, అభివృద్ధి వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు సజ్జల. మూడు రాజధానులే తమ విధానం అన్నారు. రాజధాని అనే పేరు పెట్టుకున్నా, లేకపోయినా మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ఎజెండా అని చెప్పారు. ఎన్నికల కోసం రాజధాని అనే నినాదం తామెప్పుడూ తెరపైకి తేలేదన్నారు.

బుగ్గన వ్యాఖ్యలను వక్రీకరించి, ప్రజలను ఎల్లో మీడియా కన్ఫ్యూజ్‌ చేస్తోందని మండిపడ్డారు సజ్జల. రియల్‌ ఎస్టేట్‌ కోసం కొందరు ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని, ఎవరూ అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని, అలాంటి అవకాశాన్ని వదులుకుని చంద్రబాబు ఘోర తప్పిదం చేశారన్నారు.

First Published:  15 Feb 2023 2:02 PM IST
Next Story