వైసీపీలో పుకార్లు, వివరణలు.. నిన్న బాలినేని, నేడు ప్రసన్న..
పార్టీ మారుతున్నట్లు తనపై వచ్చిన వార్తలను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అధికార వైసీపీలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే పుకార్లు ఇటీవల ఎక్కువయ్యాయి. మాజీ మంత్రి బాలినేని జనసేనలోకి వెళ్తున్నారని పుకార్లు రావడంతో ఆయన వెంటనే సర్దుకున్నారు. తానెక్కడికీ వెళ్లబోనని, జగన్‌తోనే ఉంటానని వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పార్టీ మారిపోతున్నారనే వార్తలొచ్చాయి. సీనియర్ అయినా కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదని, అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారని, త్వరలో ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారనే వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని ఖండించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
విజయమ్మ తర్వాత నేనే..
వైసీపీ పెట్టిన తర్వాత వైఎస్ విజయమ్మ తర్వాత తానే పార్టీకి తొలి ఎమ్మెల్యేనని అన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. అలాంటి తాను పార్టీ ఎందుకు మారతానని ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదని చాలామంది ఎమ్మెల్యేలు జగన్ దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టించారని, కానీ తన నియోజకవర్గంలో అలాంటి నిరసన ప్రదర్శనలేవీ జరగలేదని గుర్తు చేశారు. తాను ఎప్పటికీ జగన్‌తోనే ఉంటానన్నారు.
బాబుని తిట్టడంలో నేనే ఫస్ట్..
చంద్రబాబు నాయుడ్ని చెడామడా తిట్టడంలో తానే నెంబర్-1 అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తన తర్వాతే ఆ స్థానం కొడాలి నానికి దక్కుతుందని, అలాంటి తాను చంద్రబాబు పంచన ఎందుకు చేరతానంటూ ప్రశ్నించారు ప్రసన్న కుమార్ రెడ్డి. గత ఎన్నికల్లో జగన్ ఫొటో చూసే తనను కోవూరు ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, తాను చనిపోయే వరకు జగన్‌తోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
ఎందుకీ ప్రచారం..?
ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడప కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఆయన ఆ కార్యక్రమంలో స్పీడ్ పెంచారు. కానీ కోవూరు నియోజకవర్గంలో 2024లో ప్రసన్నకు టికెట్ దక్కకపోవచ్చనే అనుమానం కూడా ఉంది. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు టికెట్ ఆశిస్తున్నారని, ఆమె వైసీపీ తరపున కోవూరు నుంచి బరిలో దిగుతారని, అదే జరిగితే ప్రసన్నకు టికెట్ క్యాన్సిల్ అవుతుందని, ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి ముందుగానే అలర్ట్ అయ్యారు. తాను పార్టీ మారట్లేదని, తనపై దుష్ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చారు.