Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డి ఆటలు సాగలేదా?

తిరుగుబాటు చేసిన దగ్గర నుండి కోటంరెడ్డి పదేపదే పార్టీని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్యేకి టీడీపీలోని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో ఎమ్మెల్యే మరింతగా రెచ్చిపోతున్నారు.

కోటంరెడ్డి ఆటలు సాగలేదా?
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఆటలు సాగలేదు. తిరుగుబాటు చేసిన దగ్గర నుండి కోటంరెడ్డి పదేపదే పార్టీని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్యేకి టీడీపీలోని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో ఎమ్మెల్యే మరింతగా రెచ్చిపోతున్నారు. తనను పార్టీ సస్పెండ్ చేయాలని కోటంరెడ్డి కోరుకుంటున్నారు. అయితే పార్టీ ఆ పనిచేయటం లేదు. ఈ సమయంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోటంరెడ్డి అనుకున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల‌కార్డులు చేతిలో పెట్టుకుని నిరసన మొదలుపెట్టారు. ఎక్కువసేపు బయట ఉంటే పోలీసులు బయటకు పంపించేస్తారని అనుకున్నట్లున్నారు. అందుకనే అసెంబ్లీలో స్పీకర్ పోడియం దగ్గర నిలబడి గోల మొదలుపెట్టారు. మంత్రులు చెప్పేది వినకుండా తనపాటికి తాను ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తునే ఉన్నారు.

మంత్రులు ఎంతసేపు వారించినా కోటంరెడ్డి వినిపించుకోలేదు. ఎమ్మెల్యేకి టీడీపీ సభ్యులు కూడా తోడయ్యారు. దాంతో సభలో పెద్ద గందరగోళం జరిగింది. ఎమ్మెల్యేలను ఎవరి సీట్లలో వాళ్ళని కూర్చోమని స్పీకర్ చెప్పినా పట్టించుకోలేదు. దాంతో ఇక చేసేదిలేక కోటంరెడ్డితో పాటు గోలచేసిన టీడీపీ ఎమ్మెల్యేలంద‌రినీ ఈ సమావేశాల నుండి స్పీకర్ సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ కారణంగా కోటంరెడ్డి ప్లాన్ అంతా తల్లకిందులైపోయింది. రెబల్ ఎమ్మెల్యేగా తన మాట అసెంబ్లీలో చెల్లుబాటు అవుతుందని కోటంరెడ్డి ఎలా అనుకున్నారో అర్థంకావటంలేదు. తన సమస్య ఏదన్నా ఉంటే చెప్పుకోవచ్చు కానీ గోల చేయటమే టార్గెట్‌గా ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెడితే దాన్ని పసిగట్టలేనంత అమాయకులు కాదు వైసీపీ సభ్యులు. పైగా కోటంరెడ్డికి బహిరంగంగా టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడ్డారు. అంటే ముందే ప్లాన్ చేసుకుని కోటంరెడ్డి+తమ్ముళ్ళు అసెంబ్లీలోకి వచ్చారనే విషయం తెలిసిపోతోంది. అందుకనే వీళ్ళ ప్లాన్ సాగకుండా అందరినీ కలిపి స్పీకర్ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసేశారు. వీళ్ళు ఏమి చేయాలన్నా ఇక అసెంబ్లీ బయటే చేయాలంతే. మొత్తానికి కోటంరెడ్డి ఆటకు అధికార పార్టీ చెక్ చెప్పేసింది.

First Published:  16 March 2023 7:22 AM GMT
Next Story