రాహుల్ ఇష్యూపై ఏపీలో నో రెస్పాన్స్
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి చేటు వంటిదని అనేక పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు బీజేపీ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై 24 గంటలు కూడా గడవకముందే లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై అనేక పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాయి. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి చేటు వంటిదని స్పష్టం చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు బీజేపీ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్‌గాంధీకి మద్దతుగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మాత్రం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ ఈ అంశంపై కనీసం స్పందించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు బనాయించి ఆయన్ని జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఆయన ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోయే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదని భావించవచ్చు. దాంతో పాటు ఇప్పటికే బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కామెంట్ చేసి ఆ పార్టీతో విభేదాలు తెచ్చుకోవడం కూడా జగన్‌కు ఇష్టం లేకపోవచ్చు కూడా.
మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం. ఆయన తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని రాహుల్‌గాంధీతో కలిసి అనేక సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌తో ఆయన దూరంగా ఉంటున్నారు.
తాజాగా ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. అందుకు ఆ పార్టీ ఏమాత్రం సుముఖంగా లేకపోవడం కూడా తెలిసిందే. అయినా ఏపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్‌ను నమ్ముకుని బీజేపీతో కయ్యం పెట్టుకునే బదులు తటస్థంగా ఉంటే బెటర్ అని చంద్రబాబు భావిస్తూండవచ్చు. అందుకే ఆయన రాహుల్‌పై అనర్హత వేటు విషయంలో ఏమాత్రం స్పందించలేదనేది విశ్లేషకుల అంచనా.