Telugu Global
Andhra Pradesh

కందుల రమేష్‌ పుస్తకంలో అన్నీ అసత్యాలే..- విజయబాబు

చంద్రబాబే ఈ పుస్తకాన్ని కందుల రమేష్ చేత రాయించినట్టుగా ఉందని విజయ బాబు విమర్శించారు. చంద్రబాబు కోరుకున్నట్టుగా, ఆయన్ను సంతోషపెట్టిలా, మెప్పించేలా మాత్రమే పుస్తకంలోని వివరాలు ఉన్నాయన్నారు.

కందుల రమేష్‌ పుస్తకంలో అన్నీ అసత్యాలే..- విజయబాబు
X

అమరావతి వాస్తవాలు- వివాదాలు పేరుతో జర్నలిస్ట్ కందుల రమేష్ రచించిన పుసక్తంలో అన్ని అసత్యాలే ఉన్నాయని ఆర్టీఏ మాజీ కమిషనర్‌ విజయబాబు విమర్శించారు. ఇటీవలే చంద్రబాబు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబే ఈ పుస్తకాన్ని కందుల రమేష్ చేత రాయించినట్టుగా ఉందని విజయ బాబు విమర్శించారు. చంద్రబాబు కోరుకున్నట్టుగా, ఆయన్ను సంతోషపెట్టిలా, మెప్పించేలా మాత్రమే పుస్తకంలోని వివరాలు ఉన్నాయన్నారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా రామోజీరావే అమరావతి పేరును సూచించారని చంద్రబాబు చెప్పారు అంటే రామోజీరావు డైరెక్షన్‌లోనే టీడీపీ ప్రభుత్వం పనిచేసిందన్న విమర్శకు ఇది బలానిస్తోందన్నారు. అమరావతిలో అంతా పారదర్శకంగా జరిగి ఉంటే.. టీడీపీ హయాంలో సీఆర్‌డీఏలోని వివరాలు కోరుతూ వచ్చిన ఆర్టీఏ పిటిషన్లకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని విజయబాబు ప్రశ్నించారు. అంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

రాష్ట్రం విడిపోతే పోయింది.. అమరావతి రూపంలో బంపర్‌ ఆఫర్ వచ్చిందనట్టుగా టీడీపీ నేతలు రెచ్చిపోయారని విమర్శించారు. అమరావతి ప్రాంతానికి అన్యాయం చేసిందే చంద్రబాబు అని.. అయినా సరే అక్కడి వారు, కమ్యూనిస్టులు, బీజేపీ నేతలు అంతా చంద్రబాబు దారిలోనే ఈరోజు నడుస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి యూత్‌ వింగ్, మహిళా వింగ్, రైతు వింగ్ ఉన్నట్టుగానే అమరావతి జేఏసీ కూడా ఒక వింగ్ అని విజయబాబు విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి టీడీపీకి ఓట్లు రాల్చాలన్న ఉద్దేశంతోనే అమరావతివాదులు ఉత్తరాంధ్ర వైపు పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

First Published:  12 Sept 2022 8:19 AM IST
Next Story