34 నెంబర్.. పవన్ కి రోజా సవాల్
వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడినుంచి పోటీ చేసినా, పవన్ కల్యాణ్, నారా లోకేష్ మాత్రం అసెంబ్లీ గేటు తాకలేరని అన్నారు మంత్రి రోజా. పవన్, లోకేష్ ఇద్దరూ మళ్లీ ఓడిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.
ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ముగిసినా ఇంకా అక్కడక్కడ రియాక్షన్లు వినపడుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి రోజా, పవన్ పై ధ్వజమెత్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి ఆమె పవన్ కి సవాల్ విసిరారు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలను చూడాలని పవన్ పదే పదే వారాహి సభల్లో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లు గెలవాలనుకుంటున్న పవన్ కి ఆమె ఓ సవాల్ విసిరారు. ఆ 34 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సంగతి పక్కనపెడితే. అసలు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 34 మంది అభ్యర్థులనైనా పవన్ జనసేన తరపున పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించారు రోజా. దమ్ముంటే ఏపీలో 34మంది జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు.
పూనకాలు లోడింగ్..
సభల్లో ఊగిపోతూ మాట్లాడతారని ఇటీవల పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే, దానికి జనసేనాని కౌంటర్ ఇచ్చారు కూడా. ఇప్పుడు రోజా కూడా పవన్ ని అదే విషయంలో వెటకారం చేశారు. పవన్ పూనకం వచ్చినట్టు ఊగిపోతారని ఎద్దేవా చేశారు. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కు ఏమీ తెలియదన్నారు.
ఆ ఇద్దరికి అసెంబ్లీలో నో ఎంట్రీ..
వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడినుంచి పోటీ చేసినా, పవన్ కల్యాణ్, నారా లోకేష్ మాత్రం అసెంబ్లీ గేటు తాకలేరని అన్నారు మంత్రి రోజా. పవన్, లోకేష్ ఇద్దరూ మళ్లీ ఓడిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. ఓ మహిళకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించడం శుభపరిణామం అన్నారు రోజా. నాన్న స్థాపించిన టీడీపీ పగ్గాలు చేపట్టలేకపోయినా.. చివరకు ఏపీ బీజేపీ పగ్గాలను పురంద్రీశ్వరి అందుకుంటున్నారని చెప్పారు. పురంద్రీశ్వరి సహా నందమూరి కుటుంబంలో ఎవరికీ టీడీపీలో ఎదిగేందుకు చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదని అన్నారు రోజా.