Telugu Global
Andhra Pradesh

హైవేపై బీభత్సం.. ముగ్గురు మృతి.. - 9 మందికి గాయాలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హైవేపై బీభత్సం.. ముగ్గురు మృతి.. - 9 మందికి గాయాలు
X

హైవేపై విధ్వంసం చోటుచేసుకుంది. ఆగివున్న ఐషర్‌ వ్యానును గమనించక కారు వెనుక నుంచి ఢీకొనగా, ఆ వెనుకే కూలీలతో వస్తున్న టాటా ఏస్‌ మినీ వ్యాన్‌ కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 9 మంది గాయాలపాలయ్యారు. ఒకేసారి వాహనాలు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఊహించని ఘటనతో హాహాకారాలు చేశారు. ఘటనాస్థలి ఒక్కసారిగా గాయపడినవారి ఆర్తనాదాలతో భీతావహంగా మారింది. గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

సిమెంటు, కంకర కలిపే మిల్లర్‌ను వెనుక కట్టుకున్న ఐషర్‌ వాహనం గుంటూరు వైపు వెళుతుండగా.. వాహనం మరమ్మతులకు గురవడంతో పెదకాకాని వద్ద జాతీయరహదారిపై కుడివైపు నిలిచిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న కారు రోడ్డుపై నిలిపి ఉంచిన ఐషర్‌ గమనించకపోవడంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో మిల్లర్‌ రోడ్డు మధ్యలోకి జరిగింది. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏస్‌ మినీ వాహనం మిల్లర్‌ని ఢీకొట్టింది.

రోడ్డుపై ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబాబు (40), గుంటూరు నగరానికి చెందిన తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా.. పాత గుంటూరుకు చెందిన డి.మధు (25) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడినవారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యులు ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కారులోని ముగ్గురు స్వల్పంగా గాయపడటంతో గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టాటా ఏస్‌లో 9 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వారు ఉదయం విజయవాడ వెళ్లి శుభకార్యానికి సంబంధించిన అలంకరణ పనులు పూర్తిచేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  11 Jun 2024 6:13 AM GMT
Next Story