ఎల్లోమీడియాకు కనబడటంలేదా..?
రాబోయే ఎన్నికల్లో తాను ఇండిపెండెంటుగా పోటీచేస్తానని వర్మ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తాను పిఠాపురంలో పోటీచేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు.
ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న గొడవలు రోడ్డున పడ్డాయి. చంద్రబాబు నాయుడు రెండోజాబితా ప్రకటించగానే టికెట్లు దక్కని నేతలు, తమ అభ్యర్థిత్వాలను ప్రకటించని కారణంగా మరికొందరు నేతలు ఒక్కసారిగా రివర్సయ్యారు. పిఠాపురం, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, పెనమలూరు, తిరుపతి, భీమిలి, పుట్టపర్తి లాంటి చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలు కూడా తమ్ముళ్ళతో నిరసనల్లో చేతులు కలిపారు. పిఠాపురం టిడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతుదారులు రెచ్చిపోయారు. పార్టీ జెండాలను, బ్యానర్లను రోడ్డున పడేసి తగలబెట్టారు.
రాబోయే ఎన్నికల్లో తాను ఇండిపెండెంటుగా పోటీచేస్తానని వర్మ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తాను పిఠాపురంలో పోటీచేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. పవన్ ప్రకటనతోనే నియోజకవర్గంలో వర్మ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. వర్మ గనుక పోటీలో ఉంటే పవన్ గెలుపు కష్టమే. అలాగే తణుకులో సీనియర్ నేత ముళ్ళపూడి రేణుక పార్టీకి రాజీనామా చేశారు. వైజాగ్ సౌత్ నియోజకవర్గంలో గండి బాబ్జి కూడా పార్టీకి రాజీనామా చేశారు. పెనమలూరులో టికెట్ ఇవ్వటంలేదని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పగానే బోడె మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు.
మైలవరంలో టికెట్ విషయాన్ని సస్పెన్సులో పెట్టడంతో మాజీమంత్రి దేవినేని ఉమా వర్గమంతా మండిపోతోంది. పార్టీకి రాజీనామా చేయాలని దేవినేనిపై మద్దతుదారులు బాగా ఒత్తిడి పెడుతున్నారు. రాజమండ్రి రూరల్ జనసేన నేత కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ ఇవ్వటాన్ని తమ్ముళ్ళంతా సీరియస్ గా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఆఫీసు ముందు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పెందుర్తిలో టికెట్ ఇవ్వకపోవటంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మద్దతుదారులు గోలగోలచేస్తున్నారు.
వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు జనసేన తిరుపతిలో టికెట్ ఇవ్వటాన్ని రెండుపార్టీల నేతలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆరణిని తిరుపతిలోకి అడుగు పెట్టనిచ్చేదిలేదని టీడీపీ+జనసేన నేతలు అల్టిమేటం జారీచేయటం విచిత్రం. భీమిలిలో కూడా ఇదే పరిస్థితి. టికెట్ పై ఏ విషయం తేల్చకపోవటంపై తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. పుట్టపర్తి టికెట్ ను బీసీలకు కేటాయించకుండా మాజీమంత్రి పల్లె రఘునాధరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డికి ఇవ్వటాన్ని వడ్డెర సామాజికవర్గం మండిపోతోంది.
చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు ఇంతగా రెచ్చిపోతున్నా ఎల్లోమీడియాకు ఏమీ కనబడటంలేదు. అందుకనే నిరసనలకు సంబంధించి వార్తలు, కథనాలు ఇవ్వకుండా జాగ్రత్తలుపడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఎల్లోమీడియా చేయని, దాచేస్తున్న నిజాలను సోషల్ మీడియా జనాలందరికీ ఎప్పటికప్పుడు చేరవస్తోంది.