Telugu Global
Andhra Pradesh

అమ్మఒడి నుంచి ఫీజు చెల్లింపు.. విద్యాహక్కులో మరో కిరికిరి

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అర్హులైన అందరికీ అమ్మఒడి అందుతోంది. అయితే ఇందులో ఉచిత నిర్బంధ విద్యాహక్కు ద్వారా చేరిన అడ్మిషన్లకు మాత్రం స్కూల్ ఫీజు అదనంగా రాదు. అమ్మఒడినుంచే స్కూల్ ఫీజు కట్టాలి, లేదా ప్రభుత్వమే మినహాయించుకుంటుంది.

అమ్మఒడి నుంచి ఫీజు చెల్లింపు.. విద్యాహక్కులో మరో కిరికిరి
X

ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు రిజర్వ్ చేయడం, వాటికి ప్రభుత్వం ఫీజు కట్టడం ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టంలో భాగం. ఇప్పటి వరకూ ఈ ఫీజుని ప్రభుత్వాలు కాస్త ఆలస్యంగా చెల్లించేవి, కానీ ఇకపై ఆలస్యం లేకుండా దానికి అమ్మఒడితో లింకు పెట్టింది ఏపీ ప్రభుత్వం. అమ్మఒడి సొమ్ము తీసుకున్న తల్లులు ఆ డబ్బుతో స్కూల్ ఫీజులు చెల్లించాలని, లేకపోతే ప్రభుత్వమే ఆ మొత్తం చెల్లిస్తుందని, ఆ తర్వాతి ఏడాదిలో అమ్మఒడి నుంచి మినహాయించుకుంటామని స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం కింద, ప్రైవేట్ స్కూల్స్ కి ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు.

గతంలో ప్రభుత్వాలు కాస్త ఆలస్యంగా స్కూల్ ఫీజులు, హాస్టల్ పీజులు చెల్లించినా ప్రైవేట్ యాజమాన్యాలు కిమ్మనకుండా ఉండేవి. ప్రభుత్వం నుంచి గుంపగుత్తగా వచ్చే మొత్తం కాబట్టి, అడ్మిషన్లకు మాత్రం ఢోకా లేకుండా ఉండేది. ఇప్పుడు అమ్మఒడితో ఫీజులను లింకు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అర్హులైన అందరికీ అమ్మఒడి అందుతోంది. అయితే ఇందులో ఉచిత నిర్బంధ విద్యాహక్కు ద్వారా చేరిన అడ్మిషన్లకు మాత్రం స్కూల్ ఫీజు అదనంగా రాదు. అమ్మఒడినుంచే స్కూల్ ఫీజు కట్టాలి, లేదా ప్రభుత్వమే మినహాయించుకుంటుంది.

తల్లిందండ్రులకు షాక్..

విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ లో చదువు వస్తుందని తల్లిదండ్రులు వారికి అడ్మిషన్లు తీసుకునేవారు. వైసీపీ హయాంలో విద్యాహక్కు విషయంలో కొన్నాళ్లు నాన్చివేద ధోరణి కొనసాగింది. అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి, గతేడాది విద్యాహక్కు చట్టం కింద కొంతమంది ప్రవేశాలు పొందారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపైనే ఆ భారం పడినట్టయింది. దీనిపై ప్రభుత్వం పునరాలోచిస్తుందా, లేక విద్యాహక్కు చట్టానికి అమ్మ ఒడికి లింకు కొనసాగిస్తుందా అనేది చూడాలి.

First Published:  27 Feb 2023 11:28 AM GMT
Next Story