Telugu Global
Andhra Pradesh

రేవంత్, మోదీ అలా.. జగన్ ఇలా..

రేవంత్ రెడ్డి, మోదీ, జగన్.. వారికి, వారి పార్టీలకు ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం మధ్య ఆసక్తికర పోలిక చెప్పారు మాజీ మంత్రి రోజా.

రేవంత్, మోదీ అలా.. జగన్ ఇలా..
X

40శాతం ఓట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారని, అదే ఓటింగ్ శాతంతో మోదీ పీఎం అయ్యారని, మరి ఏపీలో జగన్ కి కూడా 40శాతం ఓట్లు వచ్చాయని, మా పార్టీకెందుకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి రోజా. ఈవీఎంలపై అనుమానం ఉన్న మాట నిజమేనన్నారు. పెద్ద పెద్ద దేశాలన్నిట్లో బ్యాలెట్ పోరు జరుగుతుంటే భారత్ లో మాత్రమే ఈవీఎంలు ఎందుకని సూటిగా ప్రశ్నించారామె. ఈవీఎంల బదులు బ్యాలెట్ తో ఎన్నికలు జరిగాలని జగన్ చెప్పారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై విమర్శలు సంధించలేదా అని ప్రశ్నించారు రోజా.

మంచి చేసి ఓడిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రోజా. జగన్ వల్ల ఏపీలో ప్రతి కుటుంబం లబ్ధిపొందిందని, వారంతా తమకే ఓట్లు వేశారని, మరి తేడా ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. కేవలం 10శాతం ఓట్ల తేడాతో తాము అధికారం కోల్పోయామని, సమీక్ష చేసుకుంటున్నామని, తిరిగి ప్రజల్లోకి వెళ్తామని, జగనన్నను సీఎం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒక్క ఛాన్స్ అంటూ..

"నేను మారాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని అడిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, మారాను అని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రోజా. అన్ని హామీలను చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల గురించి మాట్లాడితే టీడీపీ, జనసేన భుజాలు తడుముకోవడమెందుకని అన్నారు రోజా. రుషికొండ భవనాలే కాదని, ఏపీలో నాడు నేడు పనుల్లో భాగంగా స్కూళ్లలో మౌలిక వసతులు, సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు.. ఇలా అన్నిట్నీ తమ ప్రభుత్వం అత్యంత నాణ్యతతో నిర్మించిందని వివరణ ఇచ్చారామె. వైసీపీ కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు రోజా.

First Published:  20 Jun 2024 11:52 PM GMT
Next Story