Telugu Global
Andhra Pradesh

దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం

బోయి, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలనే తీర్మానంతో పాటు.. దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలనే మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం
X

ఏపీ అసెంబ్లీలో రెండు కీలకమైన తీర్మానాలకు ఆమోదం లభించింది. వైఎస్ జగన్ పాదయాత్ర చేసే సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ తీర్మానాలను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బోయి, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలనే తీర్మానంతో పాటు.. దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలనే మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆమోదించబడిన ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం వైఎస్ జగన్ సభలో ప్రకటించారు.

సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ సమయంలోనే నవరత్నాలను ప్రకటించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించి పలు హామీలు ఇచ్చారు. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీల్లో చేర్చాలని అప్పట్లో వాళ్లు వైఎస్ జగన్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాల్మీకీ కులానికి చెందిన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం ఏక సభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాల్లో ఆ కులానికి చెందిన వారి సామాజిక స్థితిగతులను ఏక సభ్య కమిషన్ తెలుసుకొని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేసినట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఎస్టీలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని.. వారిని కూడా తాను అలాగే గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. ఇప్పుడు చేసిన తీర్మానం కారణంగా ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జగన్ స్పష్టం చేశారు. కొంత మంది గిట్టని వారే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

ఇక దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని.. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అందుకే మరోసారి దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలనే తీర్మానాన్ని చేసినట్లు తెలిపారు. మతం మారినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారవని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ రెండు తీర్మానాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొన్నది.

First Published:  24 March 2023 4:51 PM IST
Next Story