ఇంటి స్థలాలు ఇస్తే అమరావతి మురికివాడ అవుతుంది
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఒక్కొక్కరికి సెంటు భూమి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని మురికివాడగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
అమరావతిలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు ఇంటి స్థలాలు పొందే అవకాశాన్ని అమరావతి వాదులు తీవ్రంగా వ్యతిరేకించి కోర్టుకెక్కారు. అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టులో వాదించారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా అమరావతిని మురికివాడగా మార్చే కుట్ర జరుగుతోందని అమరావతి వాదుల తరపు న్యాయవాది ఆరోపించారు.
రాజధాని ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకుచెందిన వారికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అమరావతివాదులు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అమరావతివాదుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఆదినారాయణరావు.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఒక్కొక్కరికి సెంటు భూమి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని మురికివాడగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ భూముల్లో ఇచ్చుకోవాలే గానీ, రైతులు ఇచ్చిన భూముల్లో ఇంటి స్థలాలు ఇవ్వకూడదని వాదించారు. రాజధానికి ఇచ్చిన భూముల్లో స్థలాలు ఇస్తామంటే కుదరదని గట్టిగా వాదన వినిపించారు.
రైతులిచ్చిన భూములపై ప్రభుత్వానికి పరిమితంగా అధికారం ఉంటుందని కూడా వివరించారు. కాబట్టి ఇతర ప్రాంతాల వారికి ఇంటి స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణను అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరపున వాదనలు వినేందుకు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.