రామోజీని చావుదెబ్బ కొట్టిన రిజర్వ్ బ్యాంక్
ఇలా డిపాజిట్ల రూపంలో వసూళ్లు చేయాలంటే, రూల్స్ ప్రకారం అది ఇన్‌కార్పొరేటెడ్ కంపెనీ అయ్యుండాలి. అలా కాకుండా వ్యక్తులు, సంస్థలూ, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యుఎఫ్)లు నిధులు సేకరించకూడదు.
ఒక పాత తెలుగు సినిమాలో నటుడు నాగభూషణం దైవభక్తుడు. రెండు చెవుల్లోనూ పువ్వులు పెట్టుకుని వినమ్రంగా పూజలు చేస్తుంటాడు. పెద్ద మనిషి, మర్యాదస్తుడు, సౌమ్యుడు, సమాజంలో గౌరవ మర్యాదలకేమీ లోటులేనివాడు. అయితే నాగభూషణం తెరవెనక చేసేవన్నీ లత్తుకోరు పనులు, అంతులేని నీచత్వంతో సకల అరాచకాలకు పాల్పడుతుంటాడు. నిజ జీవితంలో అసలు సిసలు నాగభూషణం పేరు చెరుకూరి రామోజీరావు. అతనేదో సమాజాన్ని వెలుగు దారుల్లో ముందుకు నడిపిస్తున్నట్టుగా, చిట్‌ఫండ్ కంపెనీకి ‘మార్గదర్శి’ అని పేరు పెట్టుకున్నాడు. చిట్టీల వ్యాపారం మనందరికీ తెలిసిందే..!
అయితే రామోజీ ఆర్థిక క్రమశిక్షణతో అక్రమాలకు తెరతీశారు. సమాజం నుంచి సజావుగా డబ్బు కొట్టేయడానికి చిట్టీల వ్యాపారాన్ని హైప్రొఫెల్ కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అంతటా భారీగా ఆఫీసులు పెట్టి, ‘ఈనాడు’లో అడ్వర్‌టైజ్‌మెంట్లు దంచికొట్టి కోట్ల డిపాజిట్ల మోత మోగించారు. అయితే మన రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటినన్నింటినీ తుంగలో తొక్కి ఏకంగా 2,600 కోట్ల రూపాయలు రామోజీ జనం నుంచి రాబట్టారు. పైకి మార్గదర్శి పేరు, మార్గదర్శి ఫైనాన్సియర్ పేరిట డబ్బు వసూలు చేయుట.
ఇలా డిపాజిట్ల రూపంలో వసూళ్లు చేయాలంటే, రూల్స్ ప్రకారం అది ఇన్‌కార్పొరేటెడ్ కంపెనీ అయ్యుండాలి. అలా కాకుండా వ్యక్తులు, సంస్థలూ, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యుఎఫ్)లు నిధులు సేకరించకూడదు. రామోజీరావుకి ఈ విషయం తెలియకకాదు. చట్టాన్ని అతిక్రమించి, బహిరంగంగా బ్యాడ్ డే లైట్ రాబరీకి ఆయన పాల్పడ్డారు. కోర్టులో కేసు నడిచింది. వాదోపవాదాలు జరిగాయి. వాయిదాలు పడ్డాయి. ఇదంతా అయిన 17 సంవత్సరాల తర్వాత రామోజీ చేసింది దగుల్బాజీ పని అనీ, అన్ని వేల కోట్లూ అక్రమంగా సేకరించినవేననీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న సుప్రీం కోర్టులో తేల్చి చెప్పింది.
ఇన్నేళ్లు ఎందుకుపట్టింది..?
రామోజీ డబ్బుతో, పలుకుబడితో, ‘ఈనాడు’ పత్రికా బలంతో కేసుని సాగదీయించడంలో విజయం సాధించారు. అదీ రామోజీ చాకచక్యం. పట్టుదల, తెగించి పోరాడేతత్వం. అయితే, అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఎప్పుడూ మరొక మొండివాడు ఉంటాడు. అతని పేరు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. కొందరు లాయర్లు, కొన్ని గవర్నమెంట్లు రామోజీ కొమ్ముకాసినా, ఉండవల్లి అరుణ్‌కుమార్ అనే పట్టువదలని విక్రమార్కుడు నిరాశపడకుండా న్యాయపోరాటం సాగించారు.
ఉండవల్లి ఒక మాట క్లియర్‌గా చెప్పారు. ఎలాగైనా రామోజీని అరెస్టు చేయించడం నా ఉద్దేశం కాదు. డిపాజిట్ల సేకరణ అక్రమం అన్నదే నా పాయింటు అని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టులో విచారణ జరిగాక కోట్ల రూపాయల డిపాజిట్లు తిరిగి ఇచ్చేశామని మార్గదర్శి వారు గట్టిగా వాదించారు. అయితే ఉండవల్లి లాజిక్ ముందు ఈ ఉడతవూపులు చెల్లలేదు. ఇక్కడ డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా? లేదా? అన్నది కాదు ప్రశ్న. డిపాజిట్లు అక్రమంగా సేకరించారా లేదా అన్నదే పాయింట్ అని ఉండవల్లి తెగేసి చెప్పారు. అది అతి ముఖ్యమైన లీగల్‌పాయింటు. ఒక యువతిని రేప్ చేశాక, తప్పయిపోయింది గనక కొన్ని లక్షల రూపాయలు ఆమెకి ఇస్తాను, ఆమె చదువుకి అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటాను అని ఎవరైనా అంటే, చట్టం చాచికొడుతుంది. నేరానికి తగిన శిక్ష వేస్తుంది. మార్గదర్శి కేసులో రామోజీ తప్పు మీద తప్పు, నేరం మీద నేరం చేశారు. ఆర్థిక అక్రమాల కేసు సుప్రీం కోర్టులో నడుస్తూ ఉండగానే, ఆయన డిపాజిట్లు సేకరించడం కొనసాగించాడు. 2600 కోట్లపై విచారణ జరుగుతున్న సమయంలో మరో రెండు వేల కోట్లు దర్జాగా వసూలు చేసుకున్నారు.
చట్టంతో ఆటలాడడానికి అనేక మార్గాలు ఉంటాయి. ‘‘నన్నెవరు ప్రశ్నిస్తారు..?’’ అనే దురహంకారంతో రామోజీ నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అయితే ఎన్ని గేమ్స్ ఆడినా, నేరస్తుడికి ఒక రోజు అంటూ వస్తుంది. జగన్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్ రాజీలేని పోరాటం చేసి రామోజీని ఫిక్స్ చేశారు. రామోజీ చేసింది దారుణమైన అక్రమం అని సుప్రీం కోర్టు వేదికగా భారత రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. దాంతో, పూర్తి వివరాలు తమకి ఇవ్వాలని సుప్రీం కోర్టు అడిగింది.
రామోజీ అక్రమాలు చేయడంలో ఆరితేరినవాడు. ‘ఈనాడు’ అనే దుష్ప్రచార బాకాని అడ్డుపెట్టుకుని ఎందరో రాజకీయ ప్రత్యర్థుల్ని పాతాళానికి తొక్కేశాడు. ఎందరి ఆశల్నో చిదిమి వేశాడు. అనేక మందికి భవిష్యత్ లేకుండా చేశాడు. ఈనాడు బిజినెస్ పేజీ అండతో అనేక ఫైనాన్స్ కంపెనీల పీక నొక్కేశాడు. ఎక్కువ సర్క్యూలేషన్‌తో బ్లాక్ మెయిలింగ్ పవర్‌గా ఎదిగిన ‘ఈనాడు’ని అడ్డం పెట్టుకుని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలనే మార్చగలిగాడు. తనకి వొంగి వొంగి దండాలు పెట్టేవాళ్లనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడనే బానిస ఎదురుతిరిగే పరిస్థితి గనక వస్తే, మరొకరిని సిద్ధం చేసుకోవాలని, సొంత కులం వాడైన జయప్రకాశ్‌నారాయణ్ లోక్‌సత్తా పార్టీని తెరమీదకి తెచ్చాడు. అయితే రామోజీ ఎంత ప్రమోట్ చేసినా, జయప్రకాశ్ రాజకీయ నాయకునిగా నిలదొక్కుకోలేకపోయాడు.
‘కళాంజలి’ స్మగ్లింగ్ కేసు గుర్తుందా..?
రామోజీరావు తన కళాంజలి షోరూమ్ ముసుగులో స్మగ్లింగ్ చేస్తున్నారని ‘వార్త’ దినపత్రిక చాలా ఏళ్ల క్రితమే బయటపెట్టింది. ప్రసిద్ధ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ అప్పుడు ‘వార్త’ సంపాదకునిగా ఉన్నారు. కొన్ని రోజువులూ సాక్ష్యాలతో ‘వార్త’ సంచలన కథనాలు ప్రచురించింది. అప్పుడు ఆగ్రహంతో ఊగిపోయిన రామోజీ, ఏబీకే ప్రసాద్ గారి మీద పరువునష్టం దావా వేశారు. ఆ కేసు చాలా సంవత్సరాలు నడిచింది. ఏబీకేకి ఏమీ కాకుండానే కేసు వీగిపోయింది.
ఈనాడు దినపత్రిక సర్క్యులేషన్ తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయి, నష్టాలు పేరుకుపోతున్నాయని, కనుక క్రమంగా ‘ఈనాడు’ని మూసివేసి, డిజిటల్ పత్రికగానే నడిపి, నష్టాలు తప్పించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈలోగానే పులిమీద పుట్రలాగా, మార్గదర్శి మోసాలు బయటపడ్డాయి. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకే అంతమాట అనిందంటే, మార్గదర్శి మూతపడేరోజు ఇంకెంతో దూరంలో లేదు. వేల కోట్ల అక్రమాలకు పాల్పడినందుకు రామోజీ సంస్థకి భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది. అది కూడా వందల వేల కోట్లలోనే ఉండొచ్చు. అలా గనక జరిగితే ప్రతిష్టాత్మకమైన ఈనాడు, మార్గదర్శి కోలుకోలేని దెబ్బతింటాయి.
ఈనాడు పత్రిక పెట్టి ఇప్పటికి కచ్చితంగా 50 సంవత్సరాలు అయింది. Every dog has its own day అన్నట్టుగా... రామోజీరావు అనే మహోన్నత వ్యాపారవేత్త పతనం ఇప్పుడు ఆరంభమైంది. 87 సంవత్సరాలు దాటి 88వ పడిలోకి అడుగుపెడుతున్న రామోజీ, ఎందరి జీవితాలనో నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ, వేల కోట్ల రూపాయల్ని పచ్చి నెత్తురుగా పిండుకుంటూ భవంతులూ, ఫిలింసిటీలా నిర్మించుకున్నాడు.
ఇంత పెద్దవయసులో ‘ఈనాడు’ నష్టాల్ని లెక్కబెట్టుకుంటూ, చేతులారా చేసుకున్న మార్గదర్శి మోసాలను తలుచుకుంటూ రోజులు వెళ్లబుచ్చడం ఎంత కష్టం..! దొంగ డబ్బు కట్టడాలన్నీ కూలిపోతున్న దృశ్యాలు, పీడకలలుగా తెల్లవారుజామునే వెన్నాడితే ఆ బతుకు ఎంత దుర్భరం..!