Telugu Global
Andhra Pradesh

ఎన్నికల హింసపై సిట్ నివేదిక.. వారిపై తీవ్ర ఆరోపణలు

సిట్ తన పని పూర్తి చేసింది. ఎన్నికల హింసపై విచారణ సరిగా జరగలేదనే విషయాన్ని తన నివేదికలో హైలైట్ చేసింది.

ఎన్నికల హింసపై సిట్ నివేదిక.. వారిపై తీవ్ర ఆరోపణలు
X

ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నివేదిక సమర్పించింది. గతంలో ప్రాథమిక నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ అధికారులు.. రెండు విభాగాల్లో పూర్తి నివేదికను ఇప్పుడు సిద్ధం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన హింస, వాటికి కారణమైనవారు, వారిపై తీసుకున్న చర్యలు, పెండింగ్ లో ఉన్న ఎఫ్ఐఆర్ ల వివరాలు ఆ రెండు విభాగాల్లో పొందుపరిచారు.

ఆగంతకులెవరు..?

ఎన్నికల సమయంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంది. పోలింగ్ కేంద్రాలు పూర్తిగా వెబ్ క్యాస్టింగ్ పరిధిలో ఉన్నాయి. కానీ ఈవీఎంల ధ్వంసం విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు, ఆగంతకులు.. అంటూ ఎఫ్ఐఆర్ లు నమోదు కావడంపై సిట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కళ్లముందు ఎవరనేది స్పష్టంగా కనపడుతున్నా కేసులు పెట్టలేదని, ఆగంతకులంటూ రిపోర్ట్ రాసి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఆరోపించింది. ఎన్నికల విధుల్లో ఉన్న వీఆర్వోలు, పోలీస్ లు కూడా కేసులు పెట్టేందుకు వెనకాడారని, పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు కేసులు నమోదు కావాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని సిట్ తేల్చింది.

ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తయి, నిందితులకు శిక్ష పడేంతవరకూ జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలు పర్యవేక్షించాలని సిట్ సూచించడం గమనార్హం. పల్నాడులో 276 మంది, తిరుపతి 70మంది, అనంతపురంలో 718 మందిని అరెస్ట్ చేసినట్టు సిట్ తెలిపింది. ఇంకా అరెస్ట్ చేయాల్సిన వారు మిగిలే ఉన్నారని, వారి వివరాలను పొందుపరిచింది. ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే.. వారిలో 1245 మందిని సిట్ గుర్తించింది. మొత్తమ్మీద సిట్ తన పని పూర్తి చేసింది. ఎన్నికల హింసపై విచారణ సరిగా జరగలేదనే విషయాన్ని తన నివేదికలో హైలైట్ చేసింది.

First Published:  11 Jun 2024 7:49 AM IST
Next Story