Telugu Global
Andhra Pradesh

కలకలం రేపుతున్న రెడ్ బుక్ హోర్డింగ్ లు..

రెడ్ బుక్ హోర్డింగ్ లను తొలగించాలని, అధికారులు స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం కల్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

కలకలం రేపుతున్న రెడ్ బుక్ హోర్డింగ్ లు..
X

ఏపీలో సీఎం, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి, శాఖల కేటాయింపు కూడా జరిగింది. వీటన్నిటికంటే ముందే పగ, ప్రతీకారాలు కూడా మొదలవడం విశేషం. అయితే అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ మరికొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారికంగా చర్యలు తీసుకోవడం ఇంకా మొదలు కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రెడ్ బుక్ హోర్డింగ్ లు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

నారా లోకేష్ ఫొటోని హైలైట్ చేస్తూ పక్కన రెడ్ బుక్ ఫొటోని కూడా పెట్టి కొన్ని హోర్డింగ్ లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతీకారం కోసం ప్రభుత్వం సిద్ధమవుతోందనే హెచ్చరిక చేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏపీలో ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ అమలుకు రంగం సిద్ధమవుతోందంటూ వైసీపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. విధ్వంసకాండ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను టీడీపీ నిర్భీతిగా చాటింపు వేస్తోందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ పట్టుకుని తిరిగేవారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారుల పేర్లన్నీ అందులో రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చేవారు. ఇదే రెడ్ బుక్ పై వైసీపీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల తొలి సమావేశంలోనే చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరించినట్టు మాట్లాడటం కూడా చర్చనీయాంశమైంది. ఈ దశలో రెడ్ బుక్ హోర్డింగ్ లను తొలగించాలని, అధికారులు స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం కల్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై టీడీపీ రియాక్షన్ ఏంటో చూడాలి.

First Published:  15 Jun 2024 3:36 AM GMT
Next Story