ఏపీలో కాంగ్రెస్ పునర్నిర్మాణం..ఇదే మంచి తరుణం.. రాహుల్ వ్యాఖ్యలతో ఉత్సాహం
ఏపీలో భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే పార్టీ పుననర్నిర్మాణానికి ఇది చాలా మంచి తరుణమని, గొప్ప ప్రారంభమని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. నాలుగు రోజుల రాహుల్ పాదయాత్రలో వచ్చిన ఉత్సాహం, ఆదరణను ప్రేరణగా తీసుకుని పార్టీని పునరుజ్జీవింప చేయాలని నేతలు భావిస్తున్నారు.
తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విశేష స్పందన వస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఏపీలో యాత్రకు వస్తున్న స్పందన చూసి నాయకులు కూడా ఆశ్చర్య పోతున్నారని ఆయన అన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన చూస్తుంటే పార్టీ పుననర్నిర్మాణానికి ఇది చాలా మంచి తరుణమని, గొప్ప ప్రారంభమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పార్టీ నేతల్లోనూ, శ్రేణుల్లోనూ ఉత్సాహం పెల్లుబుకుతోంది. రాహుల్ గాంధీ వెంట పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్, కెవిపి రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు, ఎఐసిసి కార్యదర్శి జె.డి శీలం, రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.
కాగా రాహుల్ గాంధీ నాలుగు రోజుల పాదయాత్రలో వచ్చిన ఉత్సాహం, ఆదరణను ప్రేరణగా తీసుకుని పార్టీని పునరుజ్జీవింప చేయాలని నేతలు భావిస్తున్నారు. దీనికి ముందుగా పిసిసి ని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం రఘువీరా రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత సాకే శైలజానాథ్ కొనసాగుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి స్థానంలేకుండా పోవడంతో కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్ళు గడిచినా ఇక్కడి ప్రజల్లో కాంగ్రెస్ పై కోపం ఇంకా పూర్తిగా తగ్గలేదు. అయితే ప్రస్తుతం కేంద్రం విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరి పై ప్రజలు పునరాలోచిస్తున్నారు. అలాగే రాజధానుల విషయంలో స్పష్టత లేకపోవడం, విశాఖ స్టీల్ కర్మాగారం ప్రైవేటైజేషన్ చేయడం వంటి చర్యలతో బిజెపి పై అసహనంగా ఉన్నారు. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర పై చూపిస్తున్న ఆదరణను ఆసరాగా చేసుకోవాలని భావిస్తున్నారు.
పిసిసి ప్రక్షాళన యోచన..
ఈ క్రమంలో రాష్ట్ర పిసిసికి నలుగురైదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కడప జిల్లాకు చెందిన ఎన్.తులసి రెడ్డి, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపి హర్షకుమార్, జెడి శీలం పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభంగా ఉండే దళిత, మైనారిటీ వర్గాలను తిరిగి దగ్గర చేర్చుకోవాలంటే ఆ వర్గ నేతలకు అవకాశం కల్పించాలనేది ఒక ఆలోచనగా ఉందట. అంటే ఈ రేసులో నుంచి తులసిరెడ్డి, రుద్రరాజు, పల్లంరాజు పక్కకు తొలిగినట్టే.
ఇక జెడి శీలం, హర్షకుమార్ లు మిగిలారు. వీరిలో జెడీ శీలం క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపలేకపోవచ్చనే వాదన ఉంది. ఆయన ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు సమర్ధించగలరే తప్ప ప్రజలను కూడగట్టడంలోనూ ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడంలో కానీ ప్రభావవంతంగా పనిచేయగలరా అనే సందేహలు ఉన్నాయి. అందువల్ల హర్షకుమార్ కు అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో పార్టీకి ఎటూ కొత్త అధ్యక్షుడు వచ్చారు కాబట్టి మరి కొన్ని రోజుల్లో ఈ ప్రతిపాదనలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ లోగా రాష్ట్ర పరిస్థితులు, నాయకుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ కొత్త అధ్యక్షుడు ఖర్గేకు వివరిస్తారని అంటున్నారు. ఈ లోపు ఎన్ని ఆలోచనలు, ప్రభావాలు, ప్రతిపాదనలు తెరపైకి వస్తాయో చూడాలి.