కృష్ణంరాజు భార్య వ్యాఖ్యల్లో మర్మమేంటి.. రాజకీయాల్లోకి వస్తున్నట్లేనా..?
కృష్ణంరాజు 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినా చివరికి మళ్లీ సొంత పార్టీ బీజేపీ గూటికే చేరారు. బీజేపీ నేతగా ప్రధాని మోడీ వరకు అందరిలోనూ ఆయనకు గుర్తింపు ఉంది.
దివంగత నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజకీయాల్లోనూ రాణించారు. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన తర్వాత ఆయన భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారని గత కొన్ని రోజులుగా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణంరాజు స్వగ్రామమైన మొగల్తూరులో జరిగిన ఆయన జయంతి కార్యక్రమంలో తాము రెబల్‌స్టార్ బాటలోనే ప్రజాసేవలో ముందుకెళతామని వ్యాఖ్యానించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారా?
కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వైసీపీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీపడతారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. పెద్దమ్మ కోసం అవసరమైతే బాహుబలి ప్రభాస్ కూడా ప్రచారం చేస్తారనీ వార్తలు షికారు చేశాయి. క్షత్రియ ఓటర్ల ప్రాబల్యమున్న నరసాపురం నియోజకవర్గంలో కృష్ణంరాజు వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న కుటుంబం నుంచి అభ్యర్థి అయితే బాగుంటుందని వైసీపీ అధిష్టానం కూడా భావిస్తూ ఉండొచ్చు.
పాత గూటికే చేరతారా?
కృష్ణంరాజు 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినా చివరికి మళ్లీ సొంత పార్టీ బీజేపీ గూటికే చేరారు. బీజేపీ నేతగా ప్రధాని మోడీ వరకు అందరిలోనూ ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన నట వారసుడిగా ఉన్న ప్రభాస్‌కు కూడా బీజేపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామలాదేవి బీజేపీ తరఫున బరిలోకి దిగుతారని మరో ప్రచారం. కృష్ణంరాజు బాటలోనే వెళతామని తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇదే అర్థమని బీజేపీ మద్దతుదారులు చెబుతున్నారు. మొత్తంగా శ్యామలాదేవి వ్యాఖ్యలతో ఆవిడకు రాజకీయాసక్తి ఉందని అర్థమవుతోందని, కాబట్టి అన్ని పార్టీలూ ఆమెను తమ అభ్యర్థిగా నిలపాలని ప్రయత్నిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.