కూటమి గెలుపుపై సందేహాలు.. 'సాక్షి' పోస్ట్ మార్టమ్
"జగనన్నకే ఓటేశాం, అన్నకు మరీ ఇన్ని తక్కువ సీట్లు రావడమేంటని అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు" అంటోంది సాక్షి.
వైసీపీ ఓడిపోయింది సరే, మరీ ఇంత దారుణంగా ఓడిపోవడమేంటనే ప్రశ్న అన్ని చోట్లా వినపడుతోంది. సైలెంట్ ఓటింగ్ తోనే ఇలా జరిగిందని విశ్లేషకుల అంచనా. ప్రజల మనసులో ఉన్నది పోలింగ్ రోజు బయటపెట్టారు కానీ, మీడియా ఛానెళ్ల ముందు, సెఫాలజిస్ట్ ల టీమ్ ముందు, ఇరుగుపొరుగువారి ముందు కాదనేది వారి వాదన. ఇక వైసీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లలో మరో రకంగా ప్రచారం జరుగుతోంది. మోసం జరిగిందని, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెబుతున్నారు. దీనికి బలం చేకూర్చేలా సాక్షి విశ్లేషణ సాగింది.
గ్రామాల్లో అత్యధిక శాతం మంది వైసీపీకే ఓట్లు వేశారని, కానీ ఫలితాల తర్వాత వ్యవహారం తారుమారైందని సాక్షి ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. సంక్షేమ పథకాలు అందుకున్నవారంతా వైసీపీకి ఓట్లు వేశారని, కానీ ప్రతి రౌండ్ లోనూ టీడీపీకి ఏకపక్షంగా మెజార్టీ రావడమేంటనేది వారి అనుమానం. జగన్ ని ఎక్కువగా అభిమానించే గ్రామాల్లో కూడా టీడీపీకి ఎక్కువ ఓట్లు పడటం వెనక ఏదో మతలబు ఉందంటున్నారు. టీడీపీ నేతలు కూడా ఫలితాలు చూసి ఆశ్చర్యపోతున్నారంటే ఈవీఎం మిషన్లను ఏదో చేశారని ప్రజలు చర్చించుకుంటున్నట్టు సాక్షి కథనం చెబుతోంది.
"జగనన్నకే ఓటేశాం అన్నకు మరీ ఇన్ని తక్కువ సీట్లు రావడమేంటని అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు"అంటోంది సాక్షి. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారట. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వాలంటీర్లు వైసీపీకే ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల వైసీపీకి అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందనే చర్చ ఏపీలో జరుగుతోందని సాక్షి కథనాల సారాంశం.
బీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణలో కూడా ఇదే చర్చ మొదలైంది. అయితే ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు పడిపోయారని, అప్పటి వరకూ జరిగిన మంచిని మరచిపోయారని బీఆర్ఎస్ తీర్మానించంది. మూడు నెలల్లోపే ప్రజలు బీఆర్ఎస్ విలువ ఏంటో తెలుసుకున్నారని, వచ్చేసారి కాంగ్రెస్ కి ఓటు వేయరని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక ఏపీలో మాత్రం విశ్లేషణలు ఇంకా అంతదూరం రాలేదు. ప్రస్తుతానికి ఎక్కడో మోసం జరిగిందనే దగ్గరే వ్యవహారం ఆగిపోయింది. ఎవరు ఔనన్నా, కాదన్నా ఓటమి అనేది అంగీకరించాల్సిన విషయం. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లడమే రాజకీయ పార్టీల కర్తవ్యం. ప్రస్తుతానికి వైసీపీ నేతలంతా సైలెంట్ గానే ఉన్నారు. ఒకరిద్దరు మీడియా ముందుకొచ్చినా ఈవీఎం ట్యాంపరింగ్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ న్యాయపోరాటానికి దిగుతుందా, కోర్టు మెట్లెక్కుతుందా..? వేచి చూడాలి.