Telugu Global
Andhra Pradesh

అక్కడ చేపల చెరువులే పంట భూములు

ప్రభుత్వం నుంచి పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అక్రమంగా పొందేందుకు వీరంతా సిండికేట్ అయి చేసిన పని ఇది. ఈ అక్రమాలన్నీ బయటపడింది తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో.

అక్కడ చేపల చెరువులే పంట భూములు
X

అవును.. మీరు సరిగానే చదివారు.. అక్కడ చేపల చెరువులే పంట భూములట, పలువురు రైతులు, మిల్లర్లతో కుమ్మక్కైన రైతు భరోసా కేంద్రాల అధికారులు అలాగే పేర్కొన్నారు మరి.. ఈ-క్రాప్ నమోదులో. ప్రభుత్వం నుంచి పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అక్రమంగా పొందేందుకు వీరంతా సిండికేట్ అయి చేసిన పని ఇది. ఈ అక్రమాలన్నీ బయటపడింది తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో. ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టగా, పశ్చిమగోదావరి జిల్లాలోనూ దీనిపై దృష్టిపెట్టిన కలెక్టర్ అక్రమాలను గుర్తించి ఆర్బీకే అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఉద్యాన అసిస్టెంట్లపై వేటు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 19 మండలాల్లో గల ఆర్బీకేల్లో ఏకంగా 23 మందిని సస్పెండ్ చేసి, మరో 84 మందికి మెమోలు ఇచ్చారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు..

వ్యవసాయ శాఖ అధికారుల్లో గుబులు..

ఈ-క్రాప్ నమోదులో అక్రమాల వ్యవహారం బయటపడటంతో పలువురు వ్యవసాయ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

మిగతా జిల్లాల్లోనూ..

రెండు జిల్లాల్లోనే ఇన్ని అక్రమాలు బయటపడ్డాయంటే మిగిలిన జిల్లాల్లో పంట కాలువలు, చేపల చెరువుల పేరుతో ఇంకెన్ని అక్రమాలు జరిగి ఉంటాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది.

First Published:  24 Aug 2022 10:17 AM GMT
Next Story