విశాఖకు ఆర్బీఐ రాజధాని ముద్ర వేసేసిందా?
మార్చిలోగా భవనాన్ని చూసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో విశాఖపట్నం తొందరలోనే రాజధాని అయిపోవటం ఖాయమని రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రకటనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సానుకూలంగా స్పందించింది. ఢిల్లీలో ఈమధ్యనే జరిగిన పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. తొందరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతున్నట్లు ప్రకటించారు. తాను కూడా రాబోయే నెలల్లో విశాఖకు వెళతానని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. జగన్ ప్రకటన రాజకీయంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. జగన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ పార్టీలు ఏకంగా సుప్రీంకోర్టులో పిటీషన్లు కూడా వేశాయి.
సరే రాజకీయ వివాదాలను వదిలేస్తే జగన్ ప్రకటనకు సానుకూలంగా ఆర్బీఐ స్పందించటం పెద్ద డెవలప్‌మెంట్ అనే చెప్పాలి. విశాఖపట్నంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆర్బీఐ డిసైడ్ చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆర్బీఐ సేవలు హైదరాబాద్ నుండే అందుతున్నాయి. చంద్రబాబునాయుడు హయాంలోనే అమరావతి ప్రాంతంలో ఆర్బీఐకి స్థలం కేటాయించినా ఎందుకనో నిర్మాణం చేయలేదు. బహుశా రాజధానిగా అమరావతే ఉంటుందనే విషయమై ఆర్బీఐకి లోలోపల ఏమన్నా అనుమానాలున్నాయేమో.
దాదాపు మూడేళ్ళపాటు కేటాయించిన స్థలంలో ఆర్బీఐ ఎలాంటి నిర్మాణం చేయలేదు. అలాంటిది ఇప్పుడు జగన్ ప్రకటనతో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు విషయంలో ఆర్బీఐ ఒక్కసారిగా స్పీడు పెంచింది. విశాఖ నగరంలోని మధురవాడ, రుషికొండ, అరిలోవ, కొమ్మాది, భీమిలి, హనుమంతవాక, కైలాసగిరి, సాగర్ నగర్లో కొన్ని భవనాలను పరిశీలించింది. స్థలం తీసుకుని భవనం నిర్మించుకునేందుకు చాలాకాలం పడుతుంది కాబట్టి ముందు రెడీమేడ్‌గా భవనాన్ని అద్దెకు తీసుకోవాలని ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు.
500 మంది ఉద్యోగులు సౌకర్యంగా పనిచేసుకునేందుకు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని వెతుకుతున్నారు. ఆర్బీఐ అవసరాలకు తగ్గ భవనాలను కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యు అధికారులు జల్లెడపడుతున్నారు. మార్చిలోగా భవనాన్ని చూసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో విశాఖపట్నం తొందరలోనే రాజధాని అయిపోవటం ఖాయమని రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి. జరుగుతున్న డెవలప్‌మెంట్స్ చూస్తుంటే జగన్ విశాఖకు మారేలోపే ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటవ్వటం ఖాయమైపోయింది.