Telugu Global
Andhra Pradesh

కన్నా చేరికపై రాయపాటి యూటర్న్

ఇలా చేస్తూ పోతే పార్టీలో ఎవరూ మిగలరని రాయపాటి వ్యాఖ్యానించారు. అసలు తాను చంద్రబాబు వద్దకు వెళ్ళనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.

కన్నా చేరికపై రాయపాటి యూటర్న్
X

చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మొన్నటి వరకు చెబుతూ వచ్చిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా సిద్ధమైన తరువాత రాయపాటి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించడం గ్యారంటీ అంటూ రాయపాటి మాట్లాడారు.

కన్నా రాకపై ఒక టీవీ ఛానల్ వద్ద ప్రత్యేకంగా మాట్లాడిన రాయపాటి సాంబశివరావు.. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం ఒక్క చంద్రబాబుకు తప్ప పార్టీలో ఎవరికీ ఇష్టం లేదని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి తీసుకోవడం తనకే కాదు పార్టీలోని సీనియర్ నేతలందరికీ సిగ్గేస్తోందని తీవ్రంగా స్పందించారు.

కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం అన్నది ఒక తెలివి తక్కువ పని అని విమర్శించారు. గతంలో తనను, చంద్రబాబును ఎన్ని మాటలు అన్నారో గుర్తులేదా అని ప్రశ్నించారు. పందులు, కుక్కలు, నక్కలు అంటూ మాట్లాడట‌మే కాకుండా తమ సామాజిక వర్గాన్ని కూడా దూషించారని కన్నాపై ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు దగ్గరకు తీసుకోవడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని నిలదీశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకోవడం అవసరమని చంద్రబాబు చెబుతున్నారని..?, అసలు అంత అవసరమేముంది..?, అంత భయపడాల్సిన పరిస్థితి ఏంటి..? అని రాయపాటి ప్రశ్నించారు. నరసరావుపేటలో కన్నా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసన్నారు. పార్టీలో ఇప్పటికే ఉన్నవారిని దెబ్బతీసేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అందరి ముడ్డి కిందకు నీళ్లు తెస్తున్నారని ఆవేదన చెందారు.

ఇలా చేస్తూ పోతే పార్టీలో ఎవరూ మిగలరని రాయపాటి వ్యాఖ్యానించారు. అసలు తాను చంద్రబాబు వద్దకు వెళ్ళనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తనకు ఏం చేశారు..? ఏమిచ్చారని ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి చేరుతున్న నేపథ్యంలో చంద్రబాబు తనకు ఫోన్ చేశారని కన్నా లక్ష్మీనారాయణ చేరికపై వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతానని చెప్పారన్నారు.

అచ్చెన్నాయుడు కూడా ఫోన్ చేసి కన్నా లక్ష్మీనారాయణ గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారని రాయపాటి వివరించారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరే కార్యక్రమానికి తాను హాజరుకాబోనని కూడా చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ తనపై 2010లో పరువు నష్టం దావా వేసి 12 ఏళ్లపాటు కోర్టులో కేసు నడిపారని రాయపాటి గుర్తుచేసుకున్నారు. పలుమార్లు తాను కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఈ కేసులో రాజీ చేసుకున్నారని బహుశా టీడీపీలో చేరాలనుకునే రాజీ కుదుర్చుకున్నట్టుగా ఉందని రాయపాటి చెప్పారు.

First Published:  23 Feb 2023 8:44 AM IST
Next Story