జగన్ టార్గెట్ 175 అంటుంటే.. రాయలసీమ నేతల లక్ష్యం మరోలా ఉంది.!
సీఎం జగన్ ఇంత సీరియస్‌గా చెప్పిన తర్వాత కూడా కొంత మంది నేతల్లో మాత్రం టార్గెట్ 175 అనేది అసాధ్యం అనే భావన బలంగా ఉన్నది. ఉన్న సీట్లను కాపాడుకోవడమే చాలా కష్టమవుతోందని.. ఇక క్లీన్ స్వీప్ ఎలా సాధ్యమని చర్చించుకుంటున్నారు.
వైసీపీ ప్లీనరీ సమయంలోనే సీఎం జగన్.. రాబోయే ఎన్నికల్లో మన టార్గెట్ 175 కావాలి అని చెప్పేశారు. ఇటీవల నిర్వహిస్తున్న పలు సమీక్షలు, పార్టీ సమావేశాల్లో కూడా 175 అనే నెంబర్ నుంచి వైఎస్ జగన్ అసలు దిగడం లేదు. ఏం మనం సాధించలేమా? క్వీన్ స్వీప్ చేయలేమా అని పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నారు. కుప్పంతో సహా ఏపీలోని అసెంబ్లీ సీట్లన్నీ స్వీప్ చేయాలని వైఎస్ జగన్ కాస్త సీరియస్‌గానే నాయకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జులకు బాధ్యతలు అప్పగించారు. టార్గెట్ విషయంలో తగ్గేదే లేదని.. కష్టపడిన వారికి, తన సర్వేలో గెలుస్తారని తెలిసిన వారికే టికెట్లు ఇస్తానని చెప్పేశారు. ఇప్పటి నుంచే కష్టపడాలని.. ఆ తర్వాత సీటు ఇవ్వలేదని తనను విమర్శించి లాభం లేదని మొఖం మీదే చెప్పేస్తున్నారు.
సీఎం జగన్ ఇంత సీరియస్‌గా చెప్పిన తర్వాత కూడా కొంత మంది నేతల్లో మాత్రం టార్గెట్ 175 అనేది అసాధ్యం అనే భావన బలంగా ఉన్నది. ఉన్న సీట్లను కాపాడుకోవడమే చాలా కష్టమవుతోందని.. ఇక క్లీన్ స్వీప్ ఎలా సాధ్యమని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌పై సానుభూతి కూడా పని చేసింది. కానీ ఇప్పుడు అలాంటి సానుభూతి ఏమీ లేదు. కేవలం సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మూడు రాజధానుల పేరు చెప్పుకొనే ఎన్నికలకు వెళ్లాలి. కానీ, వీటిపై అన్ని వర్గాల్లో పూర్తి సంతృప్తి లేదు. కాబట్టి జగన్ చెప్పిన టార్గెట్ చేరుకోవడం కష్టం అని అంటున్నారు. ఇక రాయలసీమ నేతలైతే ఏకంగా సమావేశం పెట్టుకొని ఈ సారి 52కు గాను 40 సీట్లు గెలవాలని సొంత టార్గెట్ పెట్టుకున్నారు.
రాయలసీమ లోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ వీటిలో 49 సీట్లు గెలుచుకున్నది. అంతకు ముందు 2014లో 30 సీట్లు రాయలసీమ నుంచే వచ్చాయి. ఇక్కడ వైసీపీకి ఎంత అనుకూలమైన వాతావరణం ఉన్నా 52కి 52 గెలవడం అసాధ్యమని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇటీవల ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల్లో పార్టీ పరిస్థితిని, టీడీపీ ఎదుగుదలను అంచనా వేశారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన 49 సీట్లను కాపాడుకోవడం కూడా కష్టమనే నిర్ణయానికి వచ్చారు. కనీసం 40 సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు.
కడప జిల్లాలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. మిగిలిన జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకున్నట్లు నాయకులు చెబుతున్నారు. కనీసం 20 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉందని.. కాస్త కష్టపడితే మనం 40 సీట్లు గెలిచి.. టీడీపీని 12 సీట్లకు పరిమితం చేయవచ్చని అంచనా వేసుకున్నారు. టార్గెట్ 52 కష్టమే. అంతే కాకుండా గత ఎన్నికల్లో వచ్చిన 49 సీట్లను కాపాడుకోవడం కూడా ఇబ్బందే. కాబట్టి మెజార్టీ చేజారకుండా 40 సీట్లను ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గెలిపించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి రాయలసీమలో కేవలం 30 నుంచి 34 సీట్లు మాత్రమే వస్తాయనే అంచనా కూడా వేశారు. అందుకే ప్రభుత్వ పథకాలు, జగన్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. టీడీపీ వస్తే మళ్లీ సీమలో హత్యా రాజకీయాలు పెరుగుతాయని ప్రజలను అప్రమత్తం చేయాలని అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ టార్గెట్ 175 పూర్తి కాకపోయినా.. మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదల మాత్రం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.