ఇంటివద్దకే రేషన్.. కొత్త ప్రభుత్వ నిర్ణయం ఇదే
ఇంటివద్దకే రేషన్ అనేది వినడానికి బాగానే ఉన్నా.. అందులో ప్రాక్టికల్ కష్టాలు కూడా ఉన్నాయి.
రేషన్ పంపిణీ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఇంటివద్దకే రేషన్ సరకులు సరఫరా చేసింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా, లేదా..? అసలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారా లేదా అనే విషయం పక్కన పెడితే కొత్త ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమైంది. రేషన్ బండ్లను తొలగించేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధపడినట్టు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే రేషన్ పంపిణీ వ్యవస్థ మళ్లీ పాతపద్ధతిలోకే వస్తుందని అర్థమవుతోంది.
అదో మూర్ఖపు నిర్ణయం..
ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది మూర్ఖపు నిర్ణయం అని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లకోసం భారీగా ఖర్చు చేశారని, వాటి నిర్వహణ, ఎండీయూ ఆపరేటర్ల జీతాలు.. అన్నీ అదనపు ఖర్చులేనని విమర్శించారు. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు కొన్నారని, ప్రతి నెలా ఒక్కో యూనిట్ కోసం రూ.25వేలు ఖర్చు చేస్తున్నారని.. ఈ విధానం వల్ల మొత్తంగా 1500కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆరోపించారు మంత్రి నాదెండ్ల. దీన్ని కొనసాగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మీడియా సమావేశం
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2024
Live Link: https://t.co/3ZG329QuHq
ప్రాక్టికల్ కష్టాలు..
ఇంటివద్దకే రేషన్ అనేది వినడానికి బాగానే ఉన్నా.. అందులో ప్రాక్టికల్ కష్టాలు కూడా ఉన్నాయి. గతంలో రేషన్ దుకాణం వద్దకు వెళ్లి సరకులు తీసుకునేవారు లబ్ధిదారులు. కాస్త ఆలస్యమైనా ఫలానా రోజు, ఫలానా టైమ్ లో రేషన్ ఇస్తారనేది ప్రజలకు కచ్చితంగా తెలుసు. మూడు నాలుగు రోజుల్లో అందరికీ రేషన్ పంపిణీ పూర్తయ్యేది, ఒకవేళ ఆలస్యమైనా అడిగి తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇంటి వద్దకే రేషన్ వాహనాలకోసం గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1500కోట్లు. పైగా ప్రతి నెలా ఎండీయూ ఆపరేటర్ కి జీతం ఇవ్వాలి. దీంతోపాటు రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ అదనం. గతంలో కేవలం డీలర్ కమీషన్ తోనే పని పూర్తయ్యేది. ఇప్పుడు అదనపు ఖర్చులు పెరిగాయి, ఆమేరకు ప్రజలకు సౌకర్యం పెరిగిందా అంటే అనుమానమే. ప్రజల్లోనే చాలామంది ఇంటివద్దకు రేషన్ ని స్వాగతించలేదు. కొత్త ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై పునరాలోచిస్తోంది. ఒకవేళ పాత పద్ధతే పునరుద్ధరిస్తే.. రేషన్ వాహనాలను ఏం చేస్తారు..? ఎండీయూ ఆపరేటర్ల భవిష్యత్ ఏంటి..? అనేది తేలాల్సి ఉంది.