Telugu Global
Andhra Pradesh

మహిళా న్యాయమూర్తిపై టీడీపీ నేతల దుష్ప్రచారం.. రాష్ట్రపతి భవన్‌ సీరియస్‌

కేసులో భాగంగా చంద్రబాబును విచారణ చేస్తున్న అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందుపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్‌ రామానుజరావు ఈ–మెయిల్‌ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు.

మహిళా న్యాయమూర్తిపై టీడీపీ నేతల దుష్ప్రచారం.. రాష్ట్రపతి భవన్‌ సీరియస్‌
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ చేస్తున్న అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందుపై టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో అనుచితంగా ప్రచారం చేస్తుండటంపై రాష్ట్రపతి భవన్‌ సీరియస్‌గా స్పందించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్‌ కార్యదర్శి పీసీ మీనా.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి లేఖ రాశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.

కేసులో భాగంగా చంద్రబాబును విచారణ చేస్తున్న అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందుపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్‌ రామానుజరావు ఈ–మెయిల్‌ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత మహిళా న్యాయమూర్తి హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదాస్పతంగా వ్యవహరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు.

ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి భవన్‌.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి లేఖ రాసింది. న్యాయమూర్తి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనడం గమనార్హం.


First Published:  23 Sept 2023 3:48 PM IST
Next Story