Telugu Global
Andhra Pradesh

సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్‌ షాక్‌

చిట్‌ ఫండ్స్‌ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలని, ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ అని వివరించారు.

సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్‌ షాక్‌
X

రామోజీరావు సంస్థ మార్గదర్శికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఆ కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి సరైన కారణాలేవీ కనిపించడం లేదని తెలిపింది.

మార్గదర్శిపై ఉన్న కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించింది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని తెలిపింది. శుక్రవారం అత్యున్నత ధర్మాసనం చేపట్టిన విచారణలో ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోనే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ నేరాలకు పాల్పడిందని తెలిపారు. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదని చెప్పారు.

ఏపీలో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఏటా రూ.3,274 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తోందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. చిట్‌ ఫండ్స్‌ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలని, ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ అని వివరించారు. తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌ ఉందన్న కారణం.. కేసుల బదిలీకి ఆధారం కాదని తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పిందని గుర్తుచేశారు. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తగిన న్యాయస్థానమని, కేసులో దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ చేస్తోందని వివరించారు.

First Published:  2 Feb 2024 1:15 PM IST
Next Story