చంద్రబాబు కోసం రామోజీ తెగింపు.. ఈసీని కూడా తప్పు పడ్తావా..?
ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన అధికారుల నియామకం విషయంలో ఈసీని కూడా ప్రశ్నించడం రామోజీరావు అహంకారం తప్ప మరేమీ కాదు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం ఈనాడు రామోజీరావు ఎంతకైనా తెగిస్తారని అందరికీ తెలుసు. అందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కూడా చులకన చేయడానికి ఆయన వెనుకాడలేదు. కొంత మంది ఎస్పీలను బదిలీ చేయాలని ఈసీ సూచించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీకి పంపించారు. దాన్ని కూడా తప్పు పడుతూ ఈనాడు వార్తాకథనాన్ని ప్రచురించింది. ఖాళీ అయిన స్థానాల్లో నియమించాల్సిన అధికారుల విషయంలో ఈనాడు ఈసీ నిజాయితీని ప్రశ్నిస్తూ వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఇంతకు ముందటి ఎస్పీల స్థానాల్లో నియమించడానికి గాను జవహర్ రెడ్డి పంపిన ఎస్పీల జాబితాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవారినే చేర్చారని ఈనాడు వ్యాఖ్యానించింది. ఎస్పీల వ్యక్తిత్వాలను కించపరచడమే కాకుండా ఈసీని కూడా రామోజీరావు తక్కువ చేస్తూ వార్తాకథనం రాయించారు. సీఎస్ జాబితా పంపినప్పటికీ వారి నియామకం విషయంలో ఈసీదే తుది నిర్ణయం. సీనియారిటీ, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఎస్ ఈసీకి జాబితాను పంపిస్తారు. అది నచ్చకపోతే ఈసీ మరో జాబితా అడుగుతుంది.
ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన అధికారుల నియామకం విషయంలో ఈసీని కూడా ప్రశ్నించడం రామోజీరావు అహంకారం తప్ప మరేమీ కాదు. కొంత మంది ఐపీఎస్ అధికారులను కించపరుస్తూ, వారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం ఎల్లో మీడియాకు అలవాటుగా మారింది. తాము చెప్పిందే చేయాలి, అది ఈసీ అయినా మరో వ్యవస్థ అయినా సరే అనే పద్ధతిలో వ్యవహరిస్తోంది.
తమ సమగ్రతను, నిజాయితీని, వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ తమను అవమానించడంపై ఐపీఎస్ అధికారుల సంఘం ఈనాడు, ఇతర మీడియా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తమను నైతికంగా దెబ్బ తీస్తున్నాయని సంఘం ఫిర్యాదు చేసింది. తమను కించపరుస్తున్నవారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.