Telugu Global
Andhra Pradesh

టీడీపీకి పాజిటివ్‌ ఎజెండా లేకనే జగన్‌పై రామోజీ అబద్ధాల చిట్టా

రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏదో పిసరంత చేసి చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా? చెప్పుకుంటూ పోతే అదో పెద్ద చిట్టా అవుతుంది.

టీడీపీకి పాజిటివ్‌ ఎజెండా లేకనే జగన్‌పై రామోజీ అబద్ధాల చిట్టా
X

తెలుగుదేశం పార్టీకి పాజిటివ్‌ ఎజెండా లేదు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ ఆయన తనయుడు నారా లోకేష్‌ గానీ చెప్పలేకపోతున్నారు. ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేకపోవడమే అందుకు కారణం. అందుకే రామోజీరావు ఈనాడు కూడా టీడీపీ ఏం చేయబోతుందనే విషయాన్ని రాయలేకపోతున్నారు. జగన్‌ కన్నా మిన్నగా టీడీపీ చేసేదేమిటో రాయలేకపోతున్నారు. ఈ కారణంగా రామోజీరావు తన పత్రికలో ప్రతి రోజూ జగన్‌పై విషం చిమ్ముతూ అబద్ధాల చిట్టా విప్పుతున్నారు.

ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలు రెండే. ఒకటి.. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది. రెండోది... వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామనేది. మొదటిదాని విషయానికి వస్తే... 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమనేది బ్రహ్మతరం కూడా కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రజలు ఆయన మాటలను నమ్మేంత అమాయకులేమీ కాదు. హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పడేయడం చంద్రబాబుకు అలవాటే. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నింటిని అమలు చేశారనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు చంద్రబాబు గానీ రామోజీరావు గానీ సమాధానం చెప్పగలరా? వీటికి సమాధానం చెప్పగలిగితే చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినదానికి విలువ ఉంటుంది.

రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏదో పిసరంత చేసి చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా? చెప్పుకుంటూ పోతే అదో పెద్ద చిట్టా అవుతుంది. ప్రజలు అడుగుతారేమోనని భయపడి మ్యానిఫెస్టోనే టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తీసేయడం నిజం కాదా?

ఇక, వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడులో రామోజీరావు తీవ్రంగా దూషించారు. వాలంటీర్లను అసాంఘిక శక్తులుగా చిత్రీకరిస్తూ వార్తాకథనం అచ్చేయించారు. రేపిస్టులుగా, దొంగలుగా వారిని చిత్రీకరించారు. వైసీపీ కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పౌర సేవలు అందిస్తున్న వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా రాతలు రాయించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు వేసిన జన్మభూమి కమిటీలు ఏం చేశాయి? ఆ కమిటీల్లో పచ్చచొక్కాలవారినే వేశారు. వారు నిర్వహించిన పాత్ర ఏమిటి?

మొత్తంగా ఎజెండా లేకపోవడం అనేది టీడీపీలో నిరుత్సాహాన్ని తెలియజేస్తుంటే, జగన్‌పై నిత్యం విరుచుకుపడడం అనైతికతే అవుతుంది. మీడియా నిర్వహించాల్సిన పాత్ర ఏమిటనేది రామోజీరావు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? తన ముద్దుల శిష్యుడు చంద్రబాబు నిర్మాణాత్మకమైన సూచనలు చేయాల్సిన పని లేదా?

First Published:  9 Feb 2024 5:35 PM IST
Next Story