రామోజీకి ఉచ్చు బిగుస్తోందా..?
మార్గదర్శి ఛైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో కోడలు శైలజ దశాబ్దాలుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు.
అద్దాల మేడలో కూర్చున్న వాళ్ళు ఎదుటి వాళ్ళపై రాళ్ళు వేయకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా తిరిగి రాయేస్తే అద్దాల మేడ కుప్పకూలిపోతుంది కాబట్టి. ఈ విషయం రామోజీరావుకు సరిగ్గా సరిపోతుంది. మీడియాను అడ్డుపెట్టుకుని రామోజీ చేస్తున్న వ్యాపారాల్లో అనేక మోసాలు జరగుతున్నట్లు ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. ఏ వ్యాపారాన్ని తీసుకున్నా చట్ట ఉల్లంఘనలు, అక్రమాలే ఉంటాయని మంత్రులు కూడా చాలాసార్లు ఆరోపించారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లాయర్ నోరిప్పారు. విచారణలో ఆర్బీఐ లాయర్లు ఎన్నిసార్లు పాల్గొన్నా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా జరిగిన విచారణలో ఆర్బీఐ లాయర్ మాట్లాడుతూ హెచ్యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబం) పేరుతో డిపాజిట్లు సేకరించటం చట్ట విరుద్ధమని స్పష్టంగా చెప్పారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించకూడదన్నారు.
అంటే మార్గదర్శి ఛైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో కోడలు శైలజ దశాబ్దాలుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు. మార్గదర్శి చిట్స్ గురించి కేంద్రప్రభుత్వం అడిగితే తనకు కేంద్ర చట్టాలు వర్తించవని చెబుతారట. రాష్ట్రప్రభుత్వం అడిగితే తాను రాష్ట్రప్రభుత్వం చట్టాల ప్రకారం వ్యాపారం చేయటంలేదని చెబుతారని ఉండవల్లి సెటైర్లు వేస్తున్నారు. ఏ చట్టమూ వర్తించకపోతే ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నారో రామోజీయే చెప్పాలని ఉండవల్లి చాలాసార్లు డిమాండ్ చేశారు.
ఉండవల్లి ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ మోసాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు విచారణలోనే బయటపడిందట. కాకపోతే విచారణను పూర్తిచేసి తీర్పు చెప్పటం ఒకటే మిగిలిందని మాజీ ఎంపీ పదేపదే చెబుతున్నారు. అదృశ్య శక్తి ద్వారా విచారణ పూర్తికాకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు కూడా ఉండవల్లి ఆరోపించారు. తాజాగా ఆర్బీఐ లాయర్ చెప్పిన విషయంతో మార్గదర్శి వ్యాపారమంతా మోసాలే అని అర్థమవుతోందని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ప్రజల నుండి రామోజీ రూ. 4,600 కోట్లు వసూలుచేసినట్లు చెప్పారు. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదావేసింది. మరారోజు ఏమవుతుందో చూడాలి.