Telugu Global
Andhra Pradesh

విచారణకు హాజరుకావడం కుదరదట

గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో చెప్పారు. అయితే అనారోగ్య కారణంతో తాను విచారణకు హాజరుకాలేనని రామోజీ, రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు శైలజ సీఐడీకి ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారట.

విచారణకు హాజరుకావడం కుదరదట
X

మార్గదర్శి మోసాలపై విచారణకు ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ హాజరుకావటంలేదా? మార్గదర్శి మోసాలపై విచారణకు ఈ రోజు హాజరుకావాలని సీఐడీ ఉన్నతాధికారులు పోయిన నెల 25న రామోజీ, శైలజకు నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో చెప్పారు. అయితే అనారోగ్య కారణంతో తాను విచారణకు హాజరుకాలేనని రామోజీ, రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు శైలజ సీఐడీకి ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారట.

విచారణకు రాలేమని చెప్పారే కానీ ఎప్పుడు హాజరు కాగలమనే విషయాన్ని వీళ్ళిద్దరు చెప్పలేదు. 87 ఏళ్ళ రామోజీకి అనారోగ్య సమస్యలు ఉండటం సహజమే. మరి శైలజ విచారణకు ఎందుకు హాజరుకావటంలేదు? రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు మాత్రమే ఆమె చెప్పారట. రాలేని పరిస్థితులు అంటే ఏమిటో చెప్పలేదు. సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరుకావటాన్ని అవమానంగా భావిస్తున్నట్లున్నారు. మరి వీళ్ళ తాజా సమాచారంపై సీఐడీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రామోజీ వయసును దృష్టిలో పెట్టుకుని, శైలజ మహిళ అన్న‌ కారణంతో సీఐడీ వీళ్ళకి బాగానే మర్యాదిచ్చింది.

మర్యాద ఇచ్చిన కారణంగా వారి ఇంటికే వెళ్ళి రెండుసార్లు విచారించింది. దాని అలుసుగా తీసుకుని వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. తమింట్లోకి దర్యాప్తు అధికారులను అడుగుపెట్టనీయకుండా చాలాసేపు రోడ్డు మీద నిలిపేశారు. సీఐడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో మార్గదర్శి సిబ్బంది రోడ్డు మీదే పెద్ద గొడవపెట్టుకున్నారు. దర్యాప్తు అధికారుల విధులను అడ్డుకోవటం కూడా నేరమే అని రామోజీకి తెలియ‌దా?

ఆ ఎపిసోడ్‌ తర్వాతే మూడో విచారణకు వీళ్ళని గుంటూరులోని సీఐడీ ఆఫీసుకే రావాలని నోటీసులిచ్చింది. ఇక్కడ విషయం ఏమిటంటే విచారణకు వీళ్ళు ఏదో కారణం చెప్పి గైర్హాజరు కావచ్చు. ఇదే పని గిట్టనివాళ్ళు చేస్తే మాత్రం భూమిబద్దలైపోతోందన్నట్లుగా తన మీడియాలో రామోజీ విరుచుకుపడతారు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ విచారణ సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎల్లో మీడియా ఎంతగా వెంటాడింది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే తనకు ఒక‌ రూలు ఇతరులకు మరో రూలు అన్నట్లుగా రామోజీ వ్యవహరిస్తున్నారు. మరి సీఐడీ ఏమి చేస్తుందో చూడాలి.

First Published:  5 July 2023 8:30 AM IST
Next Story