అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాను..
Vyooham Movie Teaser Review: వైఎస్ఆర్ వరకు అందుబాటులో ఉన్న ఆయన ఒరిజినల్ వీడియోలను వాడుకున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలకు వారికి సరిపోయే పాత్రధారుల్ని తీసుకున్నారు. జగన్, భారతి, విజయమ్మ, రోశయ్య.. తదితర పాత్రలన్నీ ఇందులో కనిపిస్తాయి.
రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' టీజర్ విడుదలైంది. టీజర్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సాగినా.. అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాను అంటూ చివర్లో జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్ ఒక్కటే వినపడింది. మొత్తమ్మీద సగటు ఆర్జీవీ మార్కు పేరడీ సీన్లతో సినిమా నింపేశారని టీజర్ తో ఓ క్లారిటీ వచ్చేసింది.
గతంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల్ని పేరడీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేశారు కానీ, పెద్దగా జనాలకు ఎక్కలేదు. ఇప్పుడు జగన్ పాత్రను హైలెట్ చేస్తూ 'వ్యూహం' అనే సినిమా అనౌన్స్ చేయడం, అందులోనూ నేరుగా సీఎం జగన్ ని రెండుసార్లు వర్మ కలవడంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ఇందులో ఏదో కొత్తగా చూపించారనే అంచనాలేర్పడ్డాయి. కానీ, ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే మాత్రం ఆ అంచనాలను నిలబెట్టుకోవడం వర్మకు కష్టమేనని తెలుస్తోంది.
టీజర్ లో ఏముంది..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన దగ్గర్నుంచి ఈ సినిమా మొదలయ్యేలా కనిపిస్తోంది. వైఎస్ఆర్ వరకు అందుబాటులో ఉన్న ఆయన ఒరిజినల్ వీడియోలను వాడుకున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలకు వారికి సరిపోయే పాత్రధారుల్ని తీసుకున్నారు. జగన్, భారతి, విజయమ్మ, రోశయ్య.. తదితర పాత్రలన్నీ ఇందులో కనిపిస్తాయి. మరోవైపు ఎన్టీఆర్ ఫొటో బ్యాక్ డ్రాప్ గా వాడుకుంటూ చంద్రబాబు ఇతర పాత్రలను కూడా పరిచయం చేశారు వర్మ. జగన్ దగ్గరకు అధిష్టానం దూతలు రావడం, సీబీఐ కేసులు, అరెస్ట్ లు, ఆ తర్వాత జగన్ రాజకీయ తంత్రం.. ఇలా సాగింది ఈ టీజర్. గొప్పగా ఉందని చెప్పలేం కానీ, గతంలో లాగా పేరడీ సీన్లని పేర్చుకుంటూ వెళ్తే మాత్రం ఈ వ్యూహం బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ.