Telugu Global
Andhra Pradesh

తూర్పుగోదావరిలో జనసేన ఖాళీ.. ఇవాళ రాజోలు వంతు

రాజోలు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావుతోపాటు మరికొందరు నేతలు జనసేనను వీడి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

తూర్పుగోదావరిలో జనసేన ఖాళీ.. ఇవాళ రాజోలు వంతు
X

ఏపీలో కాస్తో కూస్తో జనసేన బలంగా ఉంది అని చెప్పుకునేది ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే. అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం అంతా తనతోనే ఉంటుందనుకున్నారు పవన్. కానీ పవన్ 21 సీట్లతో సరిపెట్టుకుని తనపై నమ్మకం పెట్టుకున్నవారిని దారుణంగా వంచించారు. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు పవన్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన దాదాపుగా ఖాళీ అవుతోంది. తాజాగా రాజోలు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావుతోపాటు మరికొందరు నేతలు జనసేనను వీడి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.


స్వయానా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా కూడా నాయకులు నిలవనంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతల్ని మేనేజ్ చేయడం కుదిరింది కానీ, జనసేన ఇన్ చార్జ్ శేషు కుమారి ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్నారు. నమ్మించి మోసం చేశారంటూ వరుసగా ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ కు దూరం జరుగుతున్నారు. అమ‌లాపురం ఇన్ ఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ, కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా ఇటీవల జనసేనను వీడారు. టోటల్ గా తూర్పు గోదావరి జిల్లాలో జనసేన క్రమక్రమంగా ఖాళీ అవుతోంది.

వైసీపీలోకే వలసలు..

కూటమి కారణంగా తక్కువ సీట్లలో పోటీ చేస్తున్న జనసేన ఎక్కువ మంది నేతల్ని నష్టపోతోంది. పవన్ ని నమ్మి పోటీకి సిద్ధమైన నేతలంతా కూటమి వల్ల ఇబ్బంది పడ్డారు. టికెట్ల ఆశ పెట్టి తమను పవన్ వంచించారని అంటున్నారు. వారికి వైసీపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మారింది. ఆ పార్టీలో సీటు దొరకదని తెలిసినా కూడా పవన్ పై కక్ష తీర్చుకోడానికి వారంతా మూకమ్మడిగా వైసీపీలో చేరుతున్నారు. జనసేనకే కాదు, కూటమి కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి.

First Published:  18 April 2024 4:17 PM IST
Next Story