చంద్రబాబుతో రజినీ.. తగ్గేదే లేదంటున్న టీడీపీ బ్యాచ్
Rajinikanth meets Chandrababu Naidu: మొన్న పవన్ కల్యాణ్, నిన్న రజినీకాంత్.. ఇద్దరూ చంద్రబాబు ఇంటికెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారంటున్నారు టీడీపీ నాయకులు. పవన్ వస్తే పొత్తు రాజకీయాలంటూ రెచ్చిపోయిన వైసీపీ నేతలు, ఇప్పుడేమంటారంటూ ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబుతో రజినీ.. తగ్గేదే లేదంటున్న టీడీపీ బ్యాచ్
సూపర్ స్టార్ రజినీకాంత్, హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఇదీ మేటర్, దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీడీపీ ఈ ఫొటోని, ఈ కలయికను బాగా ప్రమోట్ చేసుకుంటోంది. చంద్రబాబుని రజినీకాంత్ కలిస్తే ఏమవుతుంది..? వారిద్దరి కలయిక వల్ల చంద్రబాబుకి కానీ, టీడీపీకి కానీ వచ్చే మైలేజీ ఏంటి..? పోనీ వైసీపీకి వచ్చే నష్టమేంటి..? రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ ఈ ఫొటోని మాత్రం టీడీపీ బ్యాచ్ వైరల్ చేస్తోంది. బాబు స్టామినా చూశారా అంటూ చంకలు గుద్దుకుంటోంది.
మొన్న పవన్ కల్యాణ్, నిన్న రజినీకాంత్.. ఇద్దరూ చంద్రబాబు ఇంటికెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారంటున్నారు టీడీపీ నాయకులు. పవన్ వస్తే పొత్తు రాజకీయాలంటూ రెచ్చిపోయిన వైసీపీ నేతలు, ఇప్పుడేమంటారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి అటువైపునుంచి ఇంకా సమాధానం రాలేదు. అసలీ కలయికను వైసీపీ పూర్తిగా లైట్ తీసుకుంది.
It was a pleasure to meet and interact with my dear friend 'Thalaivar' @rajinikanth today! pic.twitter.com/b8j1BxICEF
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2023
పవన్ కల్యాణ్ ఇక్కడ పార్టీ పెట్టి పోటీ చేసి ఓడిపోయారు, అక్కడ రజినీకాంత్ ఊరించి ఊరించి చివరకు అభిమానుల్ని ఉసూరుమనిపించారు. రాజకీయాలు మనకు సరిపోవంటూ సినిమాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజినీ, షూటింగ్ పూర్తయ్యాక, చంద్రబాబును కలిశారు.
చంద్రబాబుని ఎవరు కలిస్తే ఏంటి..?
చంద్రబాబుని ఎవరు ఎప్పుడు కలసినా అందులో విశేషం ఏముంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనతో ఉన్న పరిచయాన్ని బట్టి చాలామంది ఆయన్ను కలిసే అవకాశముంటుంది. సీఎం అయితే అపాయింట్ మెంట్ తీసుకోవాలి, ప్రొటోకాల్ ఉంటుంది, ఆయన బిజీ షెడ్యూల్ లో కలవచ్చు, కలవకపోవచ్చు. కాని చంద్రబాబు అలా కాదు, ఆయన్ను ఎప్పుడైనా కలిసే వీలుంటుంది. అందుకే ఆయన్ను కలిసి ఉంటారంటూ కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బదులిస్తున్నారు. బాబుగారు బాగా ఫ్రీగా ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. కానీ నాయకుల స్థాయిలో ఎవరూ స్పందించలేదు.