చంద్రబాబుకి జగనన్న ఆరోగ్య సురక్ష..! ఆస్పత్రికి తరలిస్తారంటూ ప్రచారం
చంద్రబాబుని రాజమండ్రి ఆస్పత్రికి తరలిస్తున్నారని అధికారికంగా ఎక్కడా ప్రకటన విడుదల కాలేదు కానీ ఈనాడు ఓ కథనాన్ని వండి వార్చింది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వీఐపీ గదిని అధికారులు అత్యవసరంగా సిద్ధం చేయడాన్ని దీనికి సాక్ష్యంగా చూపెడుతోంది.
రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జోరుగా సాగుతోంది. మరోవైపు రాజమండ్రి జైలులో చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ రెండిటికీ సంబంధం లేదు కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచింది. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామంటూ జైళ్లశాఖ డీఐజీ ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్పారు. జైలులో ఆయనకు అందుతున్న సౌకర్యాల గురించి వివరించారు. అయినా కూడా టీడీపీ రాద్ధాంతం ఆగలేదు. దీంతో చివరకు ఆయన్ను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి ఇన్ పేషెంట్ గా తరలించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈనాడు కథనం..
చంద్రబాబుని జైలు నుంచి రాజమండ్రి ఆస్పత్రికి తరలిస్తున్నారని అధికారికంగా ఎక్కడా ప్రకటన విడుదల కాలేదు కానీ ఈనాడు ఓ కథనాన్ని వండి వార్చింది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వీఐపీ గదిని అధికారులు అత్యవసరంగా సిద్ధం చేయడాన్ని దీనికి సాక్ష్యంగా చూపెడుతోంది. శుక్రవారం అర్థరాత్రి ఆ వీఐపీ గదిని శుభ్రం చేశారని, గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారని, వైద్యులను కూడా కేటాయించారని, ఆస్పత్రి సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయనేది ఆ కథనం సారాంశం.
ఈనాడు వార్తని పూర్తిగా కొట్టిపారేయలేం కానీ.. చంద్రబాబుకి జైలులో అన్నిరకాల వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కొన్ని గంటల ముందే అధికారులు స్పష్టం చేశారు. ఆయన స్కిన్ అలర్జీ కూడా నియంత్రణలోనే ఉందన్నారు, డీహైడ్రేషన్ లాంటివేవీ లేవన్నారు. ఈ దశలో ఆయన్ను హడావిడిగా ఆస్పత్రికి చేరిస్తే అది మరింత రచ్చకు దారితీస్తుంది. మరి రాజమండ్రిలో వీఐపీ రూమ్ ఎవరికోసం సిద్ధం చేశారనేది తేలాల్సి ఉంది. ఇంతకీ ఆ వీఐపీ ఎవరు, చంద్రబాబేనా లేక ఇంకెవరైనా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారా..? బయట వీఐపీలకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరే అవసరం ఏంటి..? అనేది తేలాల్సి ఉంది.